ఎన్నో ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. దశాబ్దాల ప్రజల పోరాటం ఫలించింది. పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేసిన ఒత్తిడి పని చేసింది. ఎట్టకేలకు ఉమ్మడి జిల్లాలో కీలకమైన బీబీనగర్- గుంటూరు రైల్వే డబ్లింగ్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పలేదు. ఫలితంగా 239 కిలోమీటర్ల మేర ఏండ్ల తరబడి సింగిల్ లైన్‌గా ఉన్న రైలు మార్గం ఇక డబుల్ లైన్‌గా మారనున్నది. అందుకోసం రూ.3,238 కోట్లతో కేంద్రం ఆమోదం తెలిపింది. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ వర్గాలు ప్రకటించాయి. డబ్లింగ్ పూర్తయితే ప్రయాణికులకు దూరభారం తగ్గనున్నది. రైళ్ల సంఖ్య పెరుగనుండగా సరుకు రవాణా మరింత సులభతరం కానున్నది. ఇన్నాళ్ల ఆలస్యానికి తెరదించుతూ క్రమం తప్పకుండా నిధులను విడుదల చేస్తూ త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తి చేయాలని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీబీనగర్- గుంటూరు రైల్వే మార్గంతో పాటు బీబీనగర్-భువనగిరి-కాజీపేట-విజయవాడ రైలు మార్గాలు ఉన్నాయి. వీటిల్లో బీబీనగర్- గుంటూరు రైలుమార్గం దశాబ్ధాల కిందట నిర్మాణం జరిగినా నేటికి సింగిల్ ట్రాక్‌తోనే నడుస్తోంది. దాంతో నల్లగొండ, మిర్యాలగూడెం మీదుగా నేరుగా గంటూరు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే అనేక ప్రయాసలు ఎదురౌవుతున్నాయి. తక్కువ సంఖ్యలో రైళ్లు, సింగిల్ ట్రాక్‌తో రాకపోకల్లో తరుచూ అంతరాయాలు, తక్కువ వేగం ఇలా అనేక అవరోధాలు కొనసాగుతున్నాయి. దాంతో ఈ రూట్లో ప్రయాణాలు అంటే ఇబ్బందులు సహాజ సిద్ధమయ్యాయి. ఇక మరోవైపు ఇదే రూట్లో దేశంలోనే ప్రసిద్ధి చెందిన రైస్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ, గ్రానైట్, ఐరన్ అండ్ కెమికల్ ఇండస్ట్రీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఎఫ్‌సీఐ గిడ్డంగులు ఇలా అనేక పరిశ్రమలు ఉన్నాయి.
వీటి ద్వారా సరుకు రవాణా కూడా పెద్ద ఎత్తున సాగుతుంటుంది. కానీ సింగిల్ లైన్ కావడంతో గూడ్స్ రవాణాకు అనేక ఆటంకాలు ఉన్నాయి. ఒకే ట్రాక్ కావడంతో రైళ్ల రాకపోకల్లోనూ తీవ్ర జాప్యం తలెత్తుతుంది. ఇటీవల ప్రవేశపెట్టిన వందేభారత్ రైలు సైతం రెండు గంటలు ఆలస్యంగా వైజాగ్‌కు చేరుకోవాల్సి వస్తుంది. ఈ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ రూట్లోని మిగతా రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేయక తప్పడం లేదు. వీటిన్నింటి నేపథ్యంలో ఈ లైన్‌ను డబుల్ లైన్‌గా మార్చాలంటూ ఎన్నో ఏండ్లుగా జిల్లా ప్రజలు, రైల్వే ప్రయాణీకులు, పారిశ్రామిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. వందల సార్లు అప్పటి కాంగ్రెస్, ఇప్పటి మోదీ సర్కార్‌కు సైతం విన్నవించారు. ఇక జిల్లా ఎంపీలు పార్టీలకు అతీతంగా ఎన్నోమార్లు రైల్వే మంత్రులను, ప్రధానమంత్రులను పార్లమెంట్ లోపల, బయట కూడా డిమాండ్ చేశారు. ఇక సీఎం కేసీఆర్ నేతృత్వంలో అప్పటి ఉద్యమ సమయంలో, నేటి పాలన సమయంలోనూ అనేకసార్లు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు దీనిపై ప్రత్యేకంగా పోరాటం చేశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అందివచ్చిన ప్రతీ సందర్భంలోనూ బీఆర్ఎస్ ఎంపీలు దీనిపై కేంద్రాన్ని నిలదీశారు. ఇటీవల రైల్వే బడ్జెట్ సమయంలోనూ డబ్లింగ్ పనులు చేపట్టాలని కేంద్రానికి విన్నవించారు. ఎంతో కీలకమైన ఈ మార్గాన్ని డబ్లింగ్ చేయడం వల్ల పారిశ్రామికంగానూ ఎంతో ఉపయోగం జరుగనుంది. కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కూడా చాలా కీలకంగా మారనుంది.
రూ.3,238 కోట్లతో ఆమోదం..
మొత్తం 239 కిలోమీటర్ల మేర రూ.3,238 కోట్లతో డబ్లింగ్ పనులకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. దాంతో ఇప్పటికే సింగిల్ లైన్‌కు అనుసంధానంగా మరో మార్గం నిర్మించనున్నారు. దీని వల్ల సికింద్రాబాద్- గుంటూరు మీదుగా విజయవాడకు దగ్గరి మార్గం కానుంది. ప్రస్తుతం భువనగిరి-కాజీపేట- ఖమ్మం మార్గంలో విజయవాడకు ఎక్కువ రైళ్లు నడుపుతున్నారు. డబ్లింగ్ పూర్తైతే ఇక్కడి నుంచి మరింతగా రైళ్ల సంఖ్య పెరుగనున్నది. దాంతో పాటు రైళ్ల రాకపోకల సమయం కూడా బాగా తగ్గనున్నది. ఇప్పటివరకు సింగిల్ ట్రాక్‌లో ఒక రైలు వస్తుందంటే మరో రైలును ఏదో ఒక స్టేషన్లో నిలుపాల్సి వస్తుంది. ఇకపై ఆ ఇబ్బందులు తప్పనున్నాయి. ఇక సరుకు రవాణా పరంగా జిల్లాలో కీలకమైన పరిశ్రమలు ఈ మార్గం వెంట నెలవై ఉన్నాయి. కెమికల్, ఐరన్, సిమెంట్, రైస్ మిల్లులు, గ్రానైట్ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటిన్నింటికి గూడ్స్ పరంగా మరింత సౌలభ్యం ఏర్పడనున్నది. 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఈ మార్గంలోని విష్ణుపురం రైల్వేస్టేషన్‌కు ఆనుకుని ఉంటుంది. దాంతో రానున్న కాలంలో డబుల్ లైన్ పవర్ ప్లాంట్‌కు ఎంతో ఉపయుక్తం కానున్నది. అందువల్ల నిధుల కొరత లేకుండా త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
పనులు వెంటనే ప్రారంభించాలి
బీబీనగర్-గుంటూరు మార్గంలో డబ్లింగ్ పనులకు ఎట్టకేలకు కేంద్ర సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం సంతోషకరం. ఏండ్ల తరబడి జిల్లా ప్రజల పోరాటం ఫలించినైట్లెంది. సీఎం కేసీఆర్ దీనిపై ప్రత్యేక శ్రద్ధతో అనేకసార్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఎంపీలుగా తామంతా పార్లమెంట్ లోపలా, బయట నినదించాం. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీగా ప్రధానికి, రైల్వే మంత్రికి తాను స్వయంగా లేఖలు అందజేశా. డబ్లింగ్ ప్రాధాన్యతను, ప్రయోజనాలను వివరించా. ఇటీవల రైల్వే జీఎంను కలిసి దీనిపై ప్రత్యేకంగా చర్చించాం. వీటన్నింటి ఫలితంగా కేంద్రం ఆమోదించడం హర్షణీయం. రైల్వే మంత్రికి కృతజ్ఞతలు. పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలి.
– బడుగుల లింగయ్యయాదవ్, రాజ్యసభ సభ్యుడు