మఠంపల్లి, మే 5 : వేసవిలో పశువులు వడదెబ్బకు గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. కావున పశువులు అనారోగ్యానికి గురైతే పశు పోషకులే గుర్తించి ప్రథమ చికిత్స అందించాలి. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే పశువులు వడదెబ్బకు గురికాకుండా కాపాడుకోవచ్చు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా పాడినే నమ్ముకుని జీవించే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం మూగజీవాల రక్షణకు కూడా ప్రత్యేక చొరవ చూపుతోంది. ఈ క్రమంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మఠంపల్లి మండల పశు వైద్యాధికారి పాడి రైతులతో సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
శరీర ప్రక్రియ మందగింపు..
వేసవిలో పశువుల శరీర ఉష్ణోగ్రత కంటే బయటి ఉష్ణోగ్రత అధికమైనప్పుడు మెదడులోని హైపోథాలమస్ శ్వేద గ్రంథుల నిర్వాహణపై పర్యవేక్షణ కోల్పోతాయి. చెమట ద్వారా శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ కోల్పోయి శరీర ప్రక్రియ మందగిస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శ్వాస, గుండె, నాడీ వేగంగా పెరుగుతాయి. మూత్రపిండాలు సరిగా పని చేయకపోవడంతో మూత్ర విసర్జన కుంటుపడుతుంది. దీంతో పశువులు అపస్మారక స్థ్ధితిలోకి వెళ్లి శ్వాస ఆడక చనిపోయే ప్రమాదం ఉంది.
వడదెబ్బ లక్షణాలు..
వడదెబ్బ తగిలిన పశువుల శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల హీట్ కంటే ఎక్కువగా ఉంటుంది. చర్మం సున్నితత్వం కోల్పోయి గట్టిపడుతుంది. నోటివెంట సొంగ కారుతుంది. నీడ కోసం చెట్టుకింద చేరి కూలబడుతాయి. శ్వాస పీల్చడం కష్టమవుతుంది. వడదెబ్బ ప్రభావంతో చూడి పశువుల్లో పాల దిగుబడి తగ్గిపోతుంది. దూడల్లో వ్యాధి నిరోదకశక్తి తగ్గుతుంది. దూడలకు అతిసార వ్యాధి వ్యాపిస్తుంది.
నివారణ చర్యలు..
వేసవిలో ఎండలోకి పశువులను వదలకూడదు. ఉదయం, సాయంత్రం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే బయటకు వదలాలి. రోజుకు మూడు, నాలుగుసార్లు చల్లటి నీటితో కడుగాలి. నాటు జాతి పశువుల కంటే సంకరజాతి ఆవులు, గేదెలు త్వరగా వడదెబ్బకు గురవుతాయి. వాటిపై తరుచుగా నీటిని చల్లుతుండాలి. గాలి బాగా వీచేలా ఎత్తైన కొట్టాలను గడ్డితో నిర్మించాలి. రేకుల కప్పులు ఉన్న పశువుల షెడ్లపై గడ్డిని కప్పి మధ్యాహ్న వేళల్లో నీళ్లు చల్లుతూ ఉండాలి. వడగాల్పుల ప్రభావం పడకుండా గోనె సంచి పరదాలను ఏర్పాటు చేసుకోవాలి.
జాగ్రత్తలు తప్పనిసరి
వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లటి గాలివీచే ప్రదేశానికి మార్చాలి. శరీర సాధారణ స్థాయికి చేరుకోవడానికి పలుమార్లు చల్లని నీటితో కడుగాలి. నీటిని అందుబాటులో ఉంచాలి. అత్యవసర పరిస్థితుల్లో 1962కు కాల్ చేయాలి. ఇంటి ముంగిటే పశువులకు వైద్యం అందుతుంది. వైద్యులు వేడిని తగ్గించే ఇంజక్షన్లు వేస్తారు.
-కట్టెల శంకర్, పశు వైద్యాధికారి, మఠంపల్లి