చండూరు, సెప్టెంబరు 15 : జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని చండూరు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన వెంకన్న డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో చీఫ్ సాంబశివరావుపై ఖమ్మం పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం చండూరు మండల కేంద్రంలో వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులతో కలిసి చండూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో, నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా దొరకక రైతులు పడుతున్న ఇబ్బందులను తెలిపిన సాంబశివరావును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం తగదన్నారు. ఇటువంటి చర్యలతో జర్నలిస్టులు భయపడతారని అనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకం అన్నారు.
చండూరు ప్రెస్ క్లబ్ సలహాదారు రాపోలు ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను వెలికి తీసి ప్రభుత్వానికి తెలియపరుస్తున్న జర్నలిస్టులను ఏదో దొంగలుగా, తప్పు చేస్తున్నటువంటి దోషులుగా నిర్ధారిస్తూ వారిపై కేసులు పెట్టడం భావ్యం కాదన్నారు. సమాజం కోసం అహర్నిశలు కష్టపడుతున్న జర్నలిస్టుల బాగు కోసం ఏదో రకంగా ప్రభుత్వాలు ఉపయోగపడాలి తప్పా ఇలాంటి చర్యలకు ఉపక్రమించోద్దని హితవు పలికారు. ఇప్పటికైనా జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయకుంటే మున్ముందు ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు, చండూరు మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.
Chandur : ‘జర్నలిస్టులపై కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి’