భూదాన్‌పోచంపల్లి, డిసెంబర్ 21 : మితిమీరిన వేగం వస్తున్న కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామ శివారులో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని హైదర్‌పూర్ గ్రామానికి చెందిన గూడూరు చంద్రారెడ్డి హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో, సగ్గు ఎల్లారెడ్డి ఎల్బీనగర్లో నివసిస్తున్నారు. శనివారం వారిద్దరు పోచంపల్లికి బ్యాంకు పని మీద బయల్దేరారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మితిమీరిన వేగంతో వస్తుండగా, జలాల్పూర్ చెరువు కట్ట మూలమలుపు వద్ద అదుపు తప్పి హెచ్చరిక బోర్డును ఢీ కొడుతూ కారు చెరువులోకి దూసుకెళ్లింది. చంద్రారెడ్డి, ఎల్లారెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆర్ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, ఎస్ఐ కంచర్ల భాసర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స కోసం వారిని భువనగిరి పంపించారు.
జలాల్పూర్ చెరువు కటపై ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మధ్యాహ్నం చెరువు కట్టపై ధర్నాకు దిగారు. ఈ నెల ఏడున కారు చెరువులోకి దూసుకెళ్లి ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయినా స్థానిక ఎమ్మెల్యే అనిల్‌కుమార్ రెడ్డి రక్షణ చర్యలు విషయం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆందోళనలో బహుజన ప్రజాశక్తి రాష్ట్ర కన్వీనర్ నల్ల లక్ష్మణ్, నాయకులు ఆగయ్య, వెంకటేశం, కృష్ణారెడ్డి, జంగయ్య, బాలరాజు, మక్బూల్, ప్రదీప్‌రెడ్డి, భరత్ భూషన్, దర్శన్, బాలరాజు, మహేందర్‌రెడ్డి, నరసింహ, భిక్షపతి, శంకర్, వెంకటేశ్ పాల్గొన్నారు. కాగా, ఆందోళనతో స్పందించిన ఎమ్మెల్యే కుంభం చెరువు వద్ద రోడ్డు భద్రత చర్యలకు రూ.20 లక్షలు మంజూరు చేయించినట్లు మీడియాకు తెలిపారు. రోడ్డు మారింగ్, సైన్ బోర్డులు, మెటల్‌తో రక్షణ కవచం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.