నల్లగొండ ప్రతినిధి, మే 17 (నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పట్టుదలతో ముందుకు సాగుతున్నది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ బీఆర్ఎస్ విజయఢంకా మోగిస్తూ వస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో సైతం గెలుపొంది వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఈ నెల 15న తెలంగాణ భవన్లో మూడు ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. మర్నాడు నుంచే పార్టీ యావత్తు ప్రచార రంగంలోకి దిగింది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా విద్యావంతుడు, రాజకీయ విశ్లేషకుడు, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా పేరొందిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఇప్పటికే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆయనకు పట్టభద్రుల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది.
అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా..
2007లో ఏర్పాటైన పట్టభద్రుల నియోజవర్గంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎన్నికలు జరుగగా అన్ని సార్లు బీఆర్ఎస్ గెలుపొందింది. ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై తన పదవికి రాజీనామా చేయడంతో అనివార్యమైన ఉప ఎన్నికలోనూ మరో విజయం కోసం బీఆర్ఎస్ సన్నద్ధమైంది. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ముఖ్య నేతలందరూ పార్టీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి గెలుపు కోసం రంగంలోకి దిగారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి గంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. ఈ నెల 15న కేటీఆర్‌తో మీటింగ్ ముగిసిన వెంటనే అక్కడే జిల్లా నేతలు భేటీ అయ్యారు. ప్రచార వ్యూహంపై చర్చించారు. ఈ మేరకు 16న సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో.. కోదాడ, దేవరకొండ, నల్లగొండ నియోజవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యులతో సమావేశాలు నిర్వహించారు. శుక్రవారం మునుగోడులో జరిగిన సమావేశంలోనూ జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. పట్టభద్రుల ఓటర్ల జాబితాను ముందేసుకుని ప్రతి ఓటరును కలిసి ఓట్లు అభ్యర్థించేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
మరోవైపు ఈ నెల 16న భువనగిరిలోని స్థానిక నేతలతో కలిసి మార్నింగ్ వాకర్స్, బార్ అసోషియేషన్ సభ్యులను కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 27న పోలింగ్ జరుగనుండగా 25న సాయంత్రం 4గంటలకు ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో ప్రచారానికి మరో ఎనిమిది రోజులే గడువు మిగిలి ఉండడంతో అభ్యర్థి రాకేశ్‌రెడ్డి అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రచార షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. ఈ నెల 19న భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో, 21న నల్లగొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌లలో, 24న నకిరేకల్, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ప్రచారంతో సంబంధం లేకుండానే మరోవైపు క్షేత్రస్థాయిలో ఓటర్లందరినీ ఎక్కడికక్కడే పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి ఓట్లను అభ్యర్థించనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యం, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం, నిరుద్యోగ భృతి ప్రకటించకపోవడం వంటి కీలక అంశాలతో పాటు కేసీఆర్ హయాంలో చేపట్టిన ఉద్యోగ నియామకాలను వివరిస్తూ విస్తృత ప్రచారం చేపట్టేందుకు సిద్ధమయ్యారు.