రాజాపేట, జనవరి 18 : రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అన్ని రంగాలలో అట్టర్ ఫ్లాప్ అయిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ విమర్శించారు. ఆదివారం రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాసంగి వరి నాట్లు పూర్తయినప్పటికీ ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా అందించకపోవడంతో రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెట్టుబడి కోసం రైతన్నలు ప్రైవేట్ ఫైనాన్స్ లను ఆశ్రయించిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులు తీర్చలేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందన్నారు.
నాడు కేసీఆర్ సకాలంలో పెట్టుబడి సాయం అందించి రైతులను రాజులుగా తీర్చిదిద్దిన రైతు బాంధవుడని కొనియాడారు. రేవంత్ సర్కార్ రెండు దఫాలుగా ఎగ్గొట్టిన రైతు భరోసా తక్షణమే ఇవ్వాలని, లేకపోతే రేవంత్ రెడ్డికి రైతుల ఉసురు తప్పక తగులుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేతను పాలన చేతకాని దద్దమ్మలైన కాంగ్రెస్ నాయకులు విమర్శించడం తగదని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ పాత పద్ధతిలో ఎన్నికల నిర్వహిస్తున్నారని, బీసీలంతా ఏకమై గ్రామపంచాయతీ ఎన్నికల తరహా మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్, మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, మదర్ డైరీ డైరెక్టర్లు సందిల భాస్కర్ గౌడ్, చింతలపూరి వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, మాజీ జడ్పిటిసి చామకూర గోపాల్ గౌడ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ గుర్రం నరసింహులు, సర్పంచ్ పయ్యావుల ఎల్లయ్య, ఉప్పలయ్య గౌడ్, మోత్కుపల్లి బాలకృష్ణ, గజ్జల రాజు, వరుణ్ రమేష్, వరిమడ్ల బాలకృష్ణ తదితరులున్నారు.