రామగిరి నల్లగొండ, జూన్ 10 : నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి బాల సాహిత్య పురస్కారం లభించింది. శాసనమండలి చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి, ప్రముఖ సాహితీవేత్త ఏనుగు నరసింహారెడ్డి, కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ఆయన రాష్ట్ర స్థాయి స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు. మంగళవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవం సందర్భంగా బుచ్చిరెడ్డి ఈ అవార్డు అందుకున్నారు.
బుచ్చిరెడ్డి కనగల్ మండలంలోని చిన్నమాదారం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. బాల సాహిత్య రంగంలో గత 15 సంవత్సరాలుగా పిల్లల కథలు, గేయాలు, కవితలు, సమీక్షలు రాస్తున్నారు. బుచ్చిరెడ్డి స్ఫూర్తి బాలసాహిత్య పురస్కారం పొందడం పట్ల తోటి ఉపాధ్యాయులు, కవులు, రచయితలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు మధుకర్, సీతారామ రాజు, వురిమల్ల సునంద, బైతి దుర్గయ్య, పులిజమున, రమాదేవి కులకర్ణి పాల్గొన్నారు.