నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్27(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేతుల్లో జీవం పోసుకుని, 13 ఏండ్లల్లోనే గమ్యాన్ని ముద్దాడి, ప్రజలిచ్చిన అధికారంతో పదేండ్లు పాలన సాగించి, కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా షురూ అయ్యాయి. టీఆర్ఎస్గా పుట్టి బీఆర్ఎస్గా రూపాంతరం చెంది 24 ఏండ్లు పూర్తి చేసుకుని 25వ యేట అడుగుపెడుతున్న వేళ ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా గులాబీ జెండాలు రెపరెపలాడాయి.
పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు ఊరూవాడ, పల్లెపట్నం తేడా లేకుండా క్షేత్రస్థాయి వరకు రజతోత్సవ వేడుకల సందర్భంగా పార్టీ శ్రేణులు జెండా పండగను ఘనంగా నిర్వహించాయి. అనంతరం రజతోత్సవ వేడుకుల ప్రారంభ సూచికంగా వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తితో నిర్వహించిన బ్రహ్మాండమైన కేసీఆర్ బహిరంగ సభకు పార్టీ యావత్తు తరలివెళ్లింది. పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు అభిమానులు, ఉద్యమకారులు, సామాన్య జనం, వివిధ వర్గాల ప్రజానీకం సైతం ఎల్కతుర్తికి దారి పట్టడంతో ఉమ్మడి జిల్లా మీదుగా ఏ దారి చూసినా గులాబీమయంగా మారింది.
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మార్గదర్శనంలో మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా నుంచి అంచనాలకు మించి జనం ఎల్కతుర్తి సభకు తరలివెళ్లింది. మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడే జెండాలు ఊపి వాహనాలను ప్రారంభించారు. ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎటూచూసినా గులాబీ జెండాలు, ఆ జెండాలు, పోస్టర్లు అలంకరించిన వాహనాలే కనిపించాయి.
హైదరాబాద్-వరంగల్ హైవేతో పాటు నకిరేకల్, అర్వపల్లి, తిరుమలగిరి, మొండ్రాయి మీదుగా వెళ్లే రహదారులపై వాహనాలు బారులు చీమలదండును తలపించాయి. ఇక సాయంత్రం సభావేదికపై నుంచి ‘ప్రజల పక్షాన ఇక నేను బయల్దేరుతా… ఎందాకైనా సరే… మళ్లా గులాబీ జెండానే ఎగురతది’ అంటూ సాగిన అధినేత కేసీఆర్ ప్రసంగం గులాబీ సైన్యంలో నూతనోత్తేజాన్ని, సమరోత్సాహాన్ని నింపింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి అంచనాలకు మించి గులాబీ సైన్యం వరంగల్‌కు తరలివెళ్లింది. పార్టీ రజతోత్సవ వేడుకల సన్నాహకాలు ఈ నెల మొదటి వారం నుంచే మొదలై వరంగల్ సభకు విస్తృత ప్రచారం కల్పించారు. పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మార్గదర్శనంలో ఉమ్మడి జిల్లా కీలక నేతలంతా రజతోత్సవ వేడుకలకు దృష్టి సారించారు. గ్రామగ్రామాన ప్రతి గులాబీ సైనికుడు భాగస్వామ్యం అయ్యేలా కార్యాచరణ రూపొందించి ముందుకు సాగారు. దీంతో సామాన్య జనం సైతం బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవంపై దృష్టి సారించక తప్పలేదు.
వాస్తవంగా రాష్ర్టాన్ని సాధించి, పదేండ్లల్లో అద్భుతంగా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన కేసీఆర్‌ను కాదనుకుని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను నమ్మి ఓట్లు చేసి గెలిపించి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్న సందర్భంలో జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు అన్ని వర్గాల ప్రజల్లోనూ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల పట్ల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పార్టీ శ్రేణులు సైతం ఉత్సాహంతో కదిలి కదం తొక్కారు.
ఆదివారం పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, పట్టణాల్లోని ప్రతి వార్డులోనూ గులాబీ జెండాలను ఎగురవేసి జెండా పండగ ఘనంగా నిర్వహించారు. శుక్ర, శనివారాల్లోనే పార్టీ జెండా దిమ్మెలను ప్రత్యేకంగా కలర్స్ వేసి, తోరణాలు కట్టి అలంకరించారు. ఆదివారం ఉదయం జెండా ఎగురవేసి అనంతరం ఎల్కతుర్తి సభకు బయల్దేరారు. దాదాపు ప్రతి గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సభకు తరలివెళ్లారు. మారుమూల తండాల్లో నుంచి సైతం వాహనాలు ఓరుగల్లు దారి పట్టాయి. చిన్న, పెద్ద వాహనాలన్నీ కలిపి 5వేలకు పైగా ఎల్కతుర్తికి పయనమైనట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అంచనాలకు మించి…
ఉమ్మడి జిల్లా నుంచి అంచనాలకు మించి జనం ఎల్కతుర్తి సభకు తరలివెళ్లారు. వాస్తవంగా 80వేల మంది వస్తారని ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోగా ప్రజల నుంచి వచ్చిన స్పందనతో అది లక్ష మంది వరకు పెంచాల్సి వచ్చింది. గత రెండుమూడు రోజులుగా క్షేత్రస్థాయి నుంచి సామాన్యులు సైతం తాము వస్తామంటూ పార్టీ నేతలపై ఒత్తిడి తేవడంతో కనిపించిన ప్రతి వాహనాన్ని సభ కోసం బుక్ చేయాల్సి వచ్చింది. దీంతో ఆదివారం ఉమ్మడి జిల్లా నుంచి లక్ష మందికి పైగా పార్టీ నేతలు, శ్రేణులు, సామాన్య జనం సైతం ఎల్కతుర్తిలో కదం తొక్కినట్లు పార్టీ నేతలు ప్రకటించారు.
ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు, స్కూలు బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్, డీసీఎంలు, టెంపోటాక్సీలు, పార్టీ నేతల సొంత వాహనాలు… ఇలా అందుబాటులో ఉన్న ప్రతి వాహానంలో జనం ఎల్కతుర్తి బాట పట్టారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండలాల వారీగా నేతలు పోటీపడి జనం తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి వాహనంపైనా నియోజకవర్గం, మండలం, ఊరి పేర్లతో గులాబీ స్టిక్కర్లు అంటించి, జెండాలతో అలంకరించారు.
దీంతో ఉమ్మడి జిల్లాలోని ప్రతి రహదారి ఆదివారం గులాబీ జెండాలున్న వాహనాలతో కనువిందు చేసింది. ఇక మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తదితరులంతా మధ్యాహ్నం వరకే సభా వేదికపైకి చేరుకున్నారు. కాగా కేసీఆర్ సభా వేదికపైకి చేరుకోవడానికి చాలా ముందే ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, ఇతర కీలక నేతలంతా వేదికపైన ఆసీనులయ్యారు.
జెండా ఊపి ప్రారంభం…
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బయల్దేరిన వాహనాలను పార్టీ ముఖ్య నేతలతో మాజీ ఎమ్మెల్యేలు జెండా ఊపి ప్రారంభించారు. నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ జెండాను ఎగురవేశారు. అనంతరం జెండాలు ఊపి సభకు వెళ్లే వాహనాలను ప్రారంభించారు. మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పార్టీ జెండాను ఎగురవేసి వామనాలకు పచ్చ జెండా ఊపి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
నకిరేకల్‌లోని పార్టీ ఆఫీసులో, నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలులో పార్టీ ఆవిర్భావం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ జెండాను ఎగురవేశారు. దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పార్టీ జెండా ఎగురవేసి వాహనాలను ప్రారంభించారు. హాలియాలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌లో పార్టీ జెండా ఎగురవేసి రజతోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు. అనంతరం సభకు వెళ్లే వాహనాలకు జెండా ఊపారు.
చౌటుప్పల్‌లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పార్టీ జెండాను ఎగురవేసి వాహనాలకు జెండా ఊపి ఎల్కతుర్తికి బయల్దేరారు. సూర్యాపేటలో పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ పార్టీ జెండాను ఎగురవేసి వాహనాలను ప్రారంభించారు. ఆలేరులో డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి పార్టీ జెండాను ఎగురవేసి సభకు వెళ్లే వాహనాలకు శ్రీకారం చుట్టారు. ఇక సభకు వెళ్లే ప్రతి వాహనంలో భోజనం, మంచినీరు, వేసవి నేపథ్యంలో మజ్జిగ తదితర సామగ్రిని సమకూర్చుకుని వెళ్లారు. మార్గమధ్యలోనే మధ్యాహ్న భోజనాలు పూర్తి చేసుకుని సాయంత్రం 3 గంటల లోపే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. రాత్రి 8గంటలకు అధినేత కేసీఆర్ ప్రసంగం ముగిశాక తిరుగుపయనమయ్యారు.