నకిరేకల్, ఏప్రిల్ 9 : బీఆర్ఎస్ రజోత్సవ సభతో దేశం చూపు తెలంగాణ వైపు పడుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఢిల్లీ పార్టీలతో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కేసిఆర్ దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ పోస్టర్లను బుధవారం నకిరేకల్ మెయిన్ సెంటర్లో ఆయన ఆవిష్కరించారు.
అనంతరం ఆర్టీసీ బస్సులు, ఆటోలకు స్వయంగా అంటించారు. ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ అడ్డగోలు హామీలతో అధికారలోకి వచ్చిన కాంగ్రెస్‌కు సగం సగం పనులు చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. రుణమాఫీ, రైతు బంధు సగంలోనే ఆపారని పేర్కొన్నారు. అనేక పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం సాధించి, అన్ని రంగాల్లో ముందు నిలిపిన కేసీఆర్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
రజోత్సవ సభకు నకిరేకల్ నియోజకవర్గవ్యాప్తంగా స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశాన్ని వినేందుకు అంతా ఆసక్తి ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రతి కార్యకర్త ఇంట్లో పండుగలా భావిస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, కట్టంగూర్ మాజీ జడ్పీటీసీ తరాల బలరాం, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు రాచకొండ వెంకట్, గుర్రం గణేశ్, నాయకులు పెండెం సదానందం, సామశ్రీనివాస్రెడ్డి, దైద పరమేశం, యానాల లింగారెడ్డి, కౌన్సిలర్ పల్లె విజయ్, అవిరెండ్ల జనార్దన్, చిట్యాల అశోక్ పాల్గొన్నారు.