కోదాడ, ఏప్రిల్ 25 : ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ఉపేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కోదాడలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిందని విమర్శించారు. ఉద్యమ నేత కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి చేయాలని అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
కేసీఆర్ తోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని, దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాలతో రైతును రాజును చేసిన మహనీయుడు కేసీఆర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి వేలాదిమంది సభను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.