ఇసుకేస్తే రాలనంత జనంతో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ భారీ సక్సెస్ అవడం బీఆర్ఎస్ శ్రేణులకు ఫుల్ జోష్ ఇచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ పవర్ఫుల్ స్పీచ్.. దిశానిర్దేశం కేడర్‌లో నూతనోత్తేజం నింపింది. పార్టీలోని అన్ని వర్గాల్లో ఉత్సాహం ఉరకలేస్తున్నది. మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు కంకణబద్ధులు అవుతున్నారు. వరంగల్‌లో సభ సక్సెస్ స్థానిక సంస్థల ఎన్నికలపై పడనుందని రాజకీయ
విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సన్నాహక సమావేశాలతో షురూ..
బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏండ్లు అవుతున్న సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. నెలన్నర ముందు నుంచే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తొలుత మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలతో జిల్లాల వారీగా భేటీ అయ్యారు. బహిరంగ సభకు సంబంధించి వారికి దిశానిర్దేశం చేశారు.
దాంతో సభ విజయవంతానికి ఆయా నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మార్గదర్శకంలో అన్ని మండల కేంద్రాలు, పట్టణాల్లో పెద్దఎత్తు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్ ముఖ్యులు, మాజీ ప్రతినిధులతో మాజీ ఎమ్మెల్యేలు సమావేశమై వివిధ అంశాలపై చర్చించి ఉత్సాహం నింపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి బస్సులు, కార్లు, ప్రైవేట్ వాహనాల్లో పెద్దఎత్తున తరలివెళ్లారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా కేసీఆర్‌ను చూసేందుకు, ప్రసంగం వినేందుకు ఆసక్తి కనబర్చారు.
శ్రేణుల్లో నూతనోత్తేజం..
వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ భారీ సక్సెస్ అవడంతో బీఆర్ఎస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాయి. కొంత కాలంగా స్తబ్ధుగా ఉండడంతో సైలెంట్‌గా ఉన్న కేడర్‌లో ఒక్కసారిగా జోష్ వచ్చింది. గ్రామాలు, పట్టణాల్లో నేతలు యాక్టివ్ అయ్యారు. ప్రజా సమస్యలపై మరింత కొట్లాడేందుకు సన్నద్ధమవుతున్నారు. అంతేగాక పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతో ముందుకు కదిలేందుకు సిద్ధమవుతున్నారు. ‘కేడర్‌కు అండగా ఉంటా.
అధికార పార్టీపై గట్టి కొట్లాడాలి. మీకేమైనా లీగల్ టీమ్ చూసుకుంటుంది. అధికారంలోకి వచ్చేది మనమే.. అధైర్యపడవద్దు’ అని సభలో కేసీఆర్ ఇచ్చిన భరోసాతో శ్రేణుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. దాంతో పార్టీ కోసం మరింత ఉత్సాహంగా పనిచే స్తామని శ్రేణులు పేర్కొంటున్నాయి. మరోవైపు ఎక్కడ చూసినా వరంగల్ బహిరంగ సభ ముచ్చట్నే వినిపిస్తున్నాయి. హోటళ్లు, బస్టాండ్లు, హెయిర్ సెలూన్లు, చికెన్ సెంటర్లు, దుకాణాలు, టీ స్టాళ్లు ఇలా అన్నిచోట్ల కేసీఆర్ ప్రసంగం, బీఆర్ఎస్ సభ విజయవంతం గురించే మాట్లాడుకుంటున్నారు. సభ జరిగిన తీరు, కేసీఆర్ స్పీచ్, జన సందోహం తదితర అంశాలపై చర్చోపచర్చలు చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం
కేసీఆర్ సభతో రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కేసీఆర్ అంటేనే రాజకీయ చతురతకు మారుపేరు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వంపై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉండడం బహిరంగంగానే కనిపిస్తున్నది. త్వరలో వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేడర్‌లో ఇప్పటి నుంచే మంచి ఊపు తీసుకురావడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారనే చర్చ నడుస్తున్నది. సభ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడనుందని పేర్కొంటున్నారు. దీంతో వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది.
అధికార పార్టీ ఆశావహుల్లో టెన్షన్
ఒక్క బహిరంగ సభతో రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ టర్న్ చేయడంతో అధికార పార్టీ ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే అనేక మంది అధికార పార్టీ ఆశావహులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పండుగలు, పబ్బాలు, ఫంక్షన్లకు జోరుగా ఖర్చు చేస్తున్నారు. కొంతమంది ఏకంగా తామే గెలుస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. తాజా వరంగల్ సభతో అంచనాలన్నీ తారుమరు అయ్యే పరిస్థితులు ఉన్నాయనే టెన్షన్ వారిలో మొదలైనట్లు తెలుస్తున్నది. భవిష్యత్‌లో బీఆర్ఎస్లోకి జోరుగా చేరికలు ఉండనున్నట్లు సమాచారం.