సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 24 : దక్షిణ భారతదేశంలో మరో కుంభ మేళాగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 27న జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్ మాటల కోసం అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, సాగు నీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండి పోయాయని, పండిన కొద్ది పంటను కొనక రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. మళ్లీ కేసీఆర్ పాలనను జనం కోరుకుంటున్నారని చెప్పారు. నాడు 14 ఏండ్లు ఉద్యమం చేసినా, పదేండ్ల పాటు అధికారంలో ఉన్నా, 16నెలలుగా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసంమే బీఆర్ఎస్ పని చేస్తుందని అన్నారు.
కేసీఆర్ ఇన్నాళ్లు మౌనంగా ఉన్నారని, ఇప్పుడు సభలో ఏం చెబుతారో, ఏం భరోసా ఇస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. సభకు సూర్యాపేట జిల్లా నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఇప్పటికే అన్ని గ్రామాలు, వార్డుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పదేండ్లు చేసిన అభివృద్ధిని, 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని వివరించామన్నారు. సభకు వెళ్లే రూట్ మ్యాప్, పార్కింగ్ వివరాలు త్వరలో విడుదల కానున్నాయని తెలిపారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ రజతోత్సవ సభకు బయల్దేరిన రైతుల ఎడ్లబండ్లకు గ్రామ గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకు వస్తే ప్రజలు తిరగబడుతారని వారి వద్దకు రావడం లేదని, జిల్లాకు మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని, ప్రజలను, రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణశ్రీనివాస్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, నాయకులు బొమ్మగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.