గుర్రంపోడు, సెప్టెంబర్ 08 : అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ గుర్రంపోడు మండల కేంద్రంలో మంగళవారం ఆ పార్టీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమన్ని చేపట్టాయి. బీఆర్ఎస్ నాగార్జునసాగర్ నియోజకవర్గ నాయకుడు పాశం గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో మహిళలు, పార్టీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులు అని కూడా చూడకుండా పోలీసులు వారి చీరలు పట్టి లాగుతూ అత్యంత అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ ఘోర ఘటనను నిరసిస్తూ మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పాశం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అవుతోందని ధ్వజమెత్తారు. చట్టసభల సాక్షిగా మహిళా నాయకులపై పోలీసులు జరిపిన దాడి ప్రభుత్వ నిరంకుశత్వానికి అద్దం పడుతోందని మండిపడ్డారు. తక్షణమే సదరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు రాజేశ్ రెడ్డి, వేముల యాదయ్య మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు రఘుపతి రెడ్డి, రావుల సైదులు, లింగయ్య, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.