ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్.. రాష్ట్ర సాధనతో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన బీఆర్ఎస్ ఎందరో నేతలను తయారు చేసిన పొలిటికల్ ఫ్యాక్టరీగా నిలుస్తున్నది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన టీఆర్ఎస్లో ఉమ్మడి జిలా నుంచి నూతన నాయకత్వం పుట్టుకు వస్తూనే ఉన్నది. రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైన ప్రతి సందర్భంలోనూ బీఆర్ఎస్ కొత్తవారికి అవకాశం ఇస్తూ వచ్చింది. కీలక నేతలతోపాటు వేల సంఖ్యలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వాన్ని తయారు చేసింది. కొందరు కీలక పదవులు సైతం అనుభవించి పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయినా సొంత బలంతో మళ్లీ నేతలను తయారు చేస్తూనే ఉంది. వ్యక్తిగత స్వార్థం కోసం ఉద్యమం పార్టీకి ద్రోహం చేసే కొందరు పార్టీలు మరినా బీఆర్ఎస్ ప్రతిసారీ నూతన బలాన్ని కూడగట్టుకుని ముందుకు సాగుతున్నది.
2001లో టీఆర్ఎస్ ఆవిర్భావంతో కొత్త నేతలు తయారయ్యే ప్రక్రియ మొదలైంది. ఉద్యమ కాలంలో విద్యార్థి, రైతు, కార్మిక, న్యాయవాద వర్గాల్లో పనిచేస్తూ అనతి కాలంలోనే పలువురు ముఖ్యమైన నేతలుగా ఎదిగారు. అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర సాధన కోసం అప్పటి వరకు రాజకీయాలతో సంబంధం లేని వారు సైతం ఎందరో గులాబీ జెండా పట్టుకుని సైన్యంలా కదిలారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వేలాది మంది నేతలుగా పుట్టుకొచ్చారు. వీరిలో ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ఎందరో ప్రజాప్రతినిధులుగా సైతం చట్టసభలకు ఎన్నికయ్యారు.
మరికొందరు ఉద్యమకారులు ప్రభుత్వంలో ఇతర పదవులు పొందారు. 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నాటి నుంచే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ కొత్త రాజకీయ చరిత్రకు శ్రీకారం చుట్టింది. పార్టీ ఆవిర్భవించిన తొలి ఎన్నికల్లోనే అప్పటి టీఆర్ఎస్ బలపరిచిన వారిలో అత్యధిక మంది గ్రామపంచాయతీ వార్డు సభ్యులుగా, సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. అదే ఏడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటారు.
2001 నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరఫున కొత్త నేతలు అవతరిస్తూనే ఉన్నారు. రాజకీయంగా అనుభవం ఉన్న కొందరు పార్టీలోకి వచ్చినా గులాబీ పార్టీ నుంచి తొలిసారిగా చట్టసభలకు ఎన్నికైన వారున్నారు. మరికొందరు ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, జడ్పీ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. గ్రామ, మండల స్థాయిలో ప్రస్తుతం కీలక నేతలుగా ఉన్న వారిలోనూ గణనీయంగా బీఆర్ఎస్తో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వారు ఉండడం విశేషం.
2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ తొలిసారిగా బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో ఆలేరు, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లో సత్తా చాటుతూ పలు ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. 2004 ఎన్నికల్లో ఆలేరు నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కుడుదుల నగేశ్ ఎన్నికయ్యారు. ఉప ఎన్నికల్లోనూ మరోసారి నగేశ్ విజయం సాధించి టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా చట్టసభల్లోకి అడుగుపెట్టారు. ఇలా.. గతంలో కొద్దిపాటి రాజకీయ నేపథ్యం ఉన్నా టీఆర్ఎస్ నుంచి తొలిసారిగా చట్ట సభలకు ఎన్నికైనవారు ఎందరో ఉన్నారు.
కేసీఆర్‌తో ఉద్యమంలో అడుగులో అడుగేస్తూ నడిచిన గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, గొంగిడి సునీత, గాదరి కిశోర్‌కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి వంటి ఉద్యమ నేతలంతా 2014లో తొలిసారి ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టడం విశేషం. భువనగిరి ఎంపీగా డాక్టర్స్ జేఏసీకి నాయకత్వం వహించిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ లోక్‌సభలో తొలిసారిగా అడుగుపెట్టారు. వీరెవరికీ గతంలో రాజకీయ వారసత్వం లేదు. కేవలం టీఆర్ఎస్తోనే వీరి రాజకీయ ఉన్నతి సాధ్యం కావడం విశేషం. ఇక ఉద్యమంలో యువజన విభాగంలో కీలకంగా ఉన్న కర్నె ప్రభాకర్, రైతు విభాగంలో పనిచేసిన ఎలిమినేటి కృష్ణారెడ్డి ఎమ్మెల్సీలుగా మండలిలో తొలిసారి ప్రాతినిథ్యం వహించారు. ఇక మధ్యలో కలిసివచ్చిన వారు సైతం తొలిసారిగా చట్టసభలకు వెళ్లగలిగింది బీఆర్ఎస్తోనే కావడం విశేషం.
టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసినా బీఆర్ఎస్లోకి వచ్చాకే బడుగుల లింగయ్యయాదవ్ రాజ్యసభలో అడుగు పెట్టగలిగారు. పారిశ్రామిక వేత్త తేర చిన్నపరెడ్డి, కాంగ్రెస్ నేత ఎంసీ కోటిరెడ్డి తొలిసారిగా బీఆర్ఎస్ నుంచే ఎమ్మెల్సీ కాగలిగారు. 2018లో ఏకంగా తొమ్మిది మంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలయ్యారు. కొత్తగా బొల్లం మల్లయ్యయాదవ్, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్ వంటి వాళ్లు తొలిసారిగా అసెంబ్లీలో అధ్యక్ష అనే అర్హత బీఆర్ఎస్తోనే సాధ్యమైంది. బండా నరేందర్‌రెడ్డి వంటి ఉద్యమ సీనియర్ నేత జడ్పీ చైర్మన్ అయ్యారు.
గుజ్జ దీపిక, ఎలిమినేటి సందీప్‌రెడ్డి వంటి వారికి జడ్పీ చైర్మన్ అవకాశం బీఆర్ఎస్తోనే సాధ్యమైంది. ఇక ఉద్యమంలో కీలకంగా పనిచేసిన దూదిమెట్ల బాలరాజుయాదవ్, సోమ భరత్‌కుమార్, మేడె రాజీవ్‌సాగర్, కంచర్ల రామకృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, తిప్పన విజయసింహారెడ్డికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం కల్పించింది. ఇక్కడ ప్రస్తావించిన వారే కాకుండా ఇలా ఉద్యమంలో టీఆర్ఎస్తో కొత్తగా ఎదిగిన నేతలతోపాటు మధ్యలో కలిసివచ్చిన ఎందరికో రాజకీయంగా చట్టసభల్లో ఎన్నో అవకాశాలు కల్పించిన ఘనమైన చరిత్ర బీఆర్ఎస్కు ఉన్నది.
ఇక జిల్లా స్థాయిల్లోనూ స్థానిక సంస్థల్లో, డీసీసీబీ, డీసీఎంఎస్, మార్కెట్ కమిటీల్లోనూ వేలాది మంది ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ వేదికగా నిలుస్తోంది.వీటన్నింటి పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ తరఫున అనేక మంది ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాగా, అందులో కొందరు పార్టీ పరంగా పదవులు అనుభవించి పార్టీకి ద్రోహం చేసి ఇతర పార్టీల్లో చేరినా.. గులాబీ పార్టీ ఎన్నడూ బలం కోల్పోలేదు. పైగా ఇలాంటి సందర్భాల్లో మరింత సమర్థవంతమైన కొత్త నేతలెందరో అధినేత కేసీఆర్ నాయకత్వంలో తయరవుతూనే వచ్చారు. అందుకే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ ఫ్యాక్టరీగా నిరంతరం వెలుగొందుతూనే ఉన్నది.