ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు పరిశీలించడానికి వెళ్లిన బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, చిత్రంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు.
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి27(నమస్తే తెలంగాణ) : ‘ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన నాటి నుంచి అక్కడికి వెళ్తున్న మంత్రుల తీరు జోకర్లను తలపిస్తుంది. మంత్రుల తీరు అక్కడ ఏ రకంగా ఉందో అందరూ గమనిస్తున్నారు. 8మంది కార్మికులు అందులో చిక్కుకుని వాళ్ల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉంటే మంత్రుల మాటలు సోయిలేకుండా ఉన్నాయి.
ఆ కుటుంబాలకు ఓదార్పునిచ్చేలా కాకుండా మరింత క్షోభకు గురిచేసేలా ఉన్నాయి. అక్కడికి పద్ధతి లేకుండా వెళ్లడం.. సరైన కండిషన్లో లేకపోవడం.. వాళ్ల వ్యక్తిగత బలహీనతలను అక్కడ బహిర్గతం చేసుకుంటున్నరు. గోడకు చెవులు పెట్టి వినడం.. సెల్ సిగ్నల్ కలుస్తుందని చెప్పడం.. వాటర్ నీళ్లు కలుస్తున్నాయని చెప్పడం.. ఇంత గలీజుగా ఓ మంత్రి వ్యవహార శైలి ఉంది. మంత్రి పదవికే మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తుండడం చాలా దారుణం’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
కేసీఆర్ నాయకత్వంలో ఉన్న తెలంగాణకు ఇవ్వాళ కాంగ్రెస్ నాయకుల చేతిలో ఉన్న తెలంగాణకు ఎంత తేడా ఉందనేది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. జాతీయంగా అంతర్జాతీయంగా తెలంగాణ పరువు తీసేలా కొం దరు మంత్రులు వ్యవహరిస్తున్నారని, ఇటువంటి వారిపై క్యాబినెట్లో సమీక్షించుకుని వారిని మం త్రి పదవుల్లో ఉంచాలో వద్దో ప్రభుత్వం తేల్చుకోవాలని హితవు పలికారు. ఎల్ఎల్బీసీ సొరంగమా ర్గం సందర్శనకు వెళ్తున్న సందర్భంగా గురువారం ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ హయాంలో 2019 నుంచి ఐదేండ్ల పాటు దీని పనులు ముందుకు కొనసాగించకపోవడానికి శ్రీశైలం నుంచి వచ్చే నీటి ఊటనే ప్రధాన కారణమని, ప్రతి నెలా కోటిన్నరకు పైగా నీటిని తోడడానికే ఖర్చు చేశామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. దీని కోసం కరెంటు కోతలు లేకుండా సంబంధిత శాఖ మంత్రిగా తానే స్వయంగా పర్యవేక్షించానని, తాము చేసిన ప్రయత్నాలు ఐదేండ్లల్లో ఏ విధంగానూ ముందుకు సాగలేదని ఆయన స్పష్టం చేశారు.
సొరంగ మార్గం తవ్వడానికి వాడుతున్న టెక్నాలజీనే అత్యంత దుర్మార్గమైందని, ఆనాడే ఆ టెక్నాలజీపై అభ్యంతరం వ్యక్తం చేశామని గుర్తు చేశారు. సొరంగమార్గం పేరుతో నల్లగొండకు ద్రోహం చేయడమే తప్ప ఇది పూర్తి చేయడం కోసం పెట్టిన ప్రాజెక్టు కాదని చెప్పామన్నారు. కేవలం నల్లగొండ జిల్లా ప్రజలను మోసం చేయడం కోసమే ఆనాటి జిల్లా కాంగ్రెస్ పెద్దల సహకారంతో సమైక్య పాలకులు చేసిన కుట్రలో భాగమే సంక్లిష్టమైన సొరంగ మార్గమని స్పష్టం చేశారు. ఇవ్వాళ జరుగుతుంది కూడా అదేనంటూ ప్రధాన ప్రతిపక్షంగా దీనిపై ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
ఎస్ఎల్బీసీ సొరంగమార్గం దుర్ఘటన దురదుష్టకరమని, జరిగిన ఘటనపై అనుమానులు ఉన్నప్పటికీ ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోవడం తీవ్ర విచారకరమని జగదీశ్‌రెడ్డి అన్నారు. కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారైనా తెలంగాణ అభివృద్ధిలో భాగమై పనిచేస్తున్నారని, వారి ప్రాణాలను కూడా చాలా విలువైనవి చెప్పారు. ఇదే విషయమై గత వారం రోజులుగా ప్రధాన ప్రతిపక్షంగా అక్కడికి వెళ్తే సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నారన్న విమర్శలు వచ్చే అవకాశం ఉండడంతో తాము దూరంగా ఉన్నట్లు చెప్పారు.
కానీ ప్రభుత్వం, మంత్రులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకు గురిచేస్తుందని, ఇలాంటి సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యతను నిర్వర్తించేందుకే టన్నెల్ సందర్శనకు వెళ్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు జరుగుతున్న సహాయ చర్యలను పరిశీలిస్తూ.. ప్రధాన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సూచనలు ప్రభుత్వానికి చేయడానికే వెళ్తున్నట్లు వివరించారు. తమ సందర్శనతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఎలాంటి ఆటంకం కలుగదని స్పష్టం చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, నాయకులు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, బోనగిరి దేవేందర్, సూదిని నరేందర్‌రెడ్డి, మారగోని గణేశ్, రావుల శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.