భువనగిరి అర్బన్, జూలై 13 : భువనగిరి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హయాంలో రూ.8 కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు ఏవీ కిరణ్‌కుమార్ అన్నారు. మార్కెట్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం సమీకృత మార్కెట్‌ను పూర్తి స్థాయిలో నిర్మాణం చేసిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా నిర్మాణం పూర్తయిన మార్కెట్ ప్రారంభానికి నోచుకోలేదని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తలేరని, ఇప్పటికైనా సమీకృత మార్కెట్‌ను అందుబాటులోకి తెచ్చి వీధి వ్యాపారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొలుపుల అమరేందర్, ఎన్నబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్య, పెంట నర్సింహ, అతికం లక్ష్మీనారాయణగౌడ్, జనగాం పాండు, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, చెన్న మహేశ్ పాల్గొన్నారు.