యాదగిరిగుట్ట, నవంబర్ 20 : ‘డిసెంబర్ 3వ తేదీన ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతక్క మూడోసారి గెలువబోతుంది.. రోడ్‌షోకు వచ్చిన జనాన్ని చూస్తుంటే విజయోత్సవ ర్యాలీని తలపిస్తుంది.. నవంబర్ 30న కారు గుర్తుపై గుద్దుడు గుద్దితే కాంగ్రెస్ పార్టీ నాయకుల దిమ్మతిరగాలి..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన రోడ్‌షోలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 55 ఏండ్ల పాలనలో అభివృద్ధికి నోచని యాదగిరిగుట్ట క్షేత్రం ప్రపంచంలోనే ఇల వైకుంఠపురంగా రూపుదిద్దుకున్నది. రూ.1,400 కోట్ల ప్రభుత్వ నిధులతో పూర్తి కృష్ణశిలను వినియోగించి ఆలయాన్ని మకుటాయమానంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారు.
తొమ్మిదిన్నరేండ్లలో రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనం యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం అని పేర్కొన్నారు. కొండచుట్టూ కాటేజీ నిర్మాణాలు, సువిశాలమైన రోడ్లతో ఆలయం ఎంతో అద్భుతంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజవకవర్గానికి మంత్రి కేటీఆర్ వరాలు ప్రకటించారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ 3 తరువాత యాదగిరిగుట్టలో 100 ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యంతో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రూ.181 కోట్లు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు మంజూరయ్యాయని, 20 ఎకరాల్లో అద్భుతంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మిస్తామన్నారు.
తుర్కపల్లిలో 138 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించి ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. భూసేకరణ చేపట్టి రైతులకు నష్టపరిహారం సైతం చెల్లించనున్నట్లు తెలిపరాఉ. దాతారుపల్లిలో 58 ఎకరాల్లో టూరిజం పార్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 3 తరువాత 5 మండలాలు, 98 గ్రామ పంచాయతీలతో ఆలేరు రెవెన్యూ డివిజన్‌ను ప్రకటిస్తామన్నారు. రాజాపేట మండలంలోని రఘునాథపురం, తుర్కపల్లి మండలంలోని మాదాపురం గ్రామాలను మండలాలుగా చేస్తామని చెప్పారు. ఆలేరులో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. ఆలేరు నియోజకవర్గాన్ని ఐటీ కారిడార్‌గా తీర్చిదిద్ది ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు.
ఒక్కప్పుడు ఉమ్మడి నల్లగొండ అంటే చుక్కనీళ్లు లేక బీడుబారిన నేలలే దర్శనమిచ్చేవని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గానికి సాగుజలాలు అందించిన పాపాన పోలేదన్నారు. సాగు నీటి జలాలను అందించాలన్న లక్ష్యం గానీ, వాటిని తీసుకురావాలన్న ఆలోచన గానీ చేయలేదన్నారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంత రూపురేఖలు మార్చినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా గోదావరి జలా లు అందించామన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ఒక్కప్పుడు 26 వేల ఎకరా లు మాత్రమే సాగులో ఉం డగా, ప్రస్తుతం 2.16 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినట్లు తెలిపా రు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వరిధాన్యం దిగుబడిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు.
24 గంటల కరెంటు ఎక్కడ అని ఆరోపిస్తున్న రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రి కేసీఆర్ సవాల్ విసిరారు. ‘మా సునీతక్కతో మాట్లాడి వాహనాన్ని ఏర్పాటు చేయిస్తా.. ఆలేరు నియోజకవర్గంలో ఏ మారుమూల గ్రామానికైనా వెళ్లి కరెంటు వైర్లు పట్టుకొని చూడండి.. 24 గంటల కరెంటు వస్తుందో.. రాదో తెలుస్తుంది.. అప్పుడైనా ఈ రాష్ర్టానికి పట్టిన శని వదులుతుంది’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ధరణి పోయి, పటేల్, పట్వారీ వ్యవస్థ వస్తుందని, మళ్లీ రైతులు హరిగోస పడటం ఖాయమని, తస్మాత్ జాగ్రత్త అని అన్నారు. 3గంటల కరెంటు చాలంటున్న కాంగెస్ కావాలా? 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలో ఆలోచించుకోవాలని సూచించారు. నవంబర్ 30న కారు గుర్తుకు ఓటేసి సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని పిలుపునిచ్చారు.
బూడిద భిక్షమయ్యగౌడ్‌ను త్వరలోనే చట్టసభలోకి తీసుకెళ్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్లోకి వచ్చిన భిక్షమయ్యకు ఆలేరు ఎన్నికల ఇన్చార్జిగా ఉన్నాడని, ఆయనకు పార్టీలో గొప్ప స్థానం కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సూదగాని హరిశంకర్‌గౌడ్, కల్లూరి రామచంద్రారెడ్డి, డీఎల్‌డీఏ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్ గడ్డమీది రవీందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్టలో మంత్రి కేటీఆర్ రోడ్‌షో హోరెత్తింది. మంత్రి రాక ముందే పట్టణంలోని ప్రధానరోడ్డు, కూడళ్లు, గల్లీగల్లీలో బీఆర్ఎస్ శ్రేణులు సందడి చేశాయి. జై కేసీఆర్.. జై కేటీఆర్.. జైజై బీఆర్ఎస్ నినాదాలతో మార్మోగింది. డప్పుచప్పుళ్లు, డోలు వాయిద్యాలు, పటాకుల మోతతో జాతరను తలపించింది. మంత్రి కేటీఆర్ ప్రసంగాన్ని స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, రైతులు, మహిళలు, యువకులు ఆలకించారు. యువకులు భారీ ఎత్తున బైక్‌ర్యాలీ నిర్వహించారు. సుమారు 15వేల బైక్‌లతో ర్యాలీ చేపట్టి మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. సుమారు 30 వేల మం ది యువకులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో స్థానికంగా ఉన్న కొంత మందికి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని మంత్రి కేటీఆర్ అన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధి జరిగింది ఇక్కడి ప్రజల కోసమేనని తెలిపారు. రింగురోడ్డు, రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణాలు, స్థలాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందజేశామన్నారు. షాపులకు షాపులు, గజం స్థలం కోల్పోయిన వారికి సైతం 100 గజాల స్థలం కేటాయించినట్లు గుర్తుచేశారు. ఆటో కార్మికులు అధైర్యపడొద్దని, డిసెంబర్ 3 తరువాత కొండపైకి ఆటోలకు అనుమతిస్తామన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆలేరు ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కేటీఆర్ ఆలేరుకు ఇచ్చిన వరాలతో రాబోయే ఐదేండ్లలో ఆలేరు రూపురేఖలు మారనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాన్ని ఐటీ, పర్యాటక, ఇండస్ట్రియల్ కారిడార్‌గా మార్చి యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంగా పని చేస్తామని హామీ ఇచ్చారు. నవంబర్ 30న జరిగే పోలింగ్‌లో కారు గుర్తుకు ఓటేసి మూడోసారి తనను దీవించాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ రోడ్‌షోకు భారీగా తరలివచ్చిన నియోజకవర్గ ప్రజానీకానికి
కృతజ్ఞతలు తెలిపారు.