యాదాద్రి భువనగిరి, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ‘శేఖరన్న మంచోడు.. సొంతంగా సంపాదించి భువనగిరి నియోజకవర్గం కోసం ఖర్చు పెడుతున్నారు.. ఇలాంటి మంచి నేత ఎక్కడా దొరకరు.. బ్రహ్మాండమైన ఎమ్మెల్యే.. గందరగోళ పడవద్దు.. ఆలోచించి ఓటేయండి.. భువనగిరి ఎమ్మెల్యేగా మరోసారి శేఖరన్నను గెలిపించండి..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం వలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత భువనగిరిని పైళ్ల శేఖర్‌రెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని చెప్పారు. ‘ఎవ్వడు అడ్డం వచ్చినా తొక్కుకుంట పోవుడే.. శేఖరన్న గెలుసుడే’ అని అన్నారు. 55 ఏండ్లు అభివృద్ధి చేయలేని కాంగ్రెసోళ్లు ఇప్పుడు అది చేస్తాం, ఇది చేస్తామని వస్తే ఒళ్లు పగలగొట్టాలన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తొమ్మిదిన్నరేండ్లలో చేసి చూపించిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాను ఏర్పాటు చేసిందెవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర ప్రజలు కరెంట్ కష్టాలతో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు వలిగొండలో ఎక్కడైనా కరెంట్ తీగలు పట్టుకోండి.. 24 గంటల కరెంటుఉ ఉందో లేదో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ కావాలో.. కరెంట్ కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నాడని, కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ చేస్తామంటున్నారని మండిపడ్డారు.
రాబంధుల లెక్క పీక్కతిన్నోళ్లు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. అధికారంలో రాగానే అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. వరి ధాన్యం దిగుబడిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నంబర్‌వన్ ప్లేస్‌లో ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే మోరీలో వేసినట్లేనని, కారు గుర్తుకు ఓటేసి పైళ్ల శేఖర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని
పిలుపునిచ్చారు.
వలిగొండ : మరోసారి ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా భువనగిరి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మూడోసారి ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో తెలంగాణలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కోట్లాది నిధులు ఖర్చు చేసి సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతోపాటు మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు రూపొందించి దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, ఏఎంసీ చైర్మన్ పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్‌రెడ్డి, వంగాల వెంకన్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, ముద్దసాని కిరణ్‌రెడ్డి, చిట్టెడ్డి జనార్దన్‌రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్, కునపురి కవిత, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ గ్రామశాఖల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.