సూర్యాపేట టౌన్, మార్చి 17 : ప్రభుత్వం చేతగాని, చేవలేనితనాన్ని ఎండగడుతూ ప్రజల పక్షాన కొట్లాడే ప్రధాన పాత్రను బీఆర్ఎస్ పార్టీ పోషిస్తున్నదని, అందులో భాగంగా ఈ నెల 20న సూర్యాపేట జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్ తెలిపారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వాళ్లు మాట్లాడారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పీకర్‌ను అవమానించినట్లు వీడియోల్లో ఎక్కడా లేదని, అయినా అదే సాకుగా చూపి దళిత స్పీకర్‌ను అంటారా అంటూ పదే పదే స్పీకర్‌ను కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారు.
జగదీశ్‌రెడ్డి అసెంబ్లీలో ఉంటే వారి ఆటలు సాగడం లేదని, అప్రజాస్వామికంగా ఆయన్ని బయటకు పంపారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తోలు తీస్తా.. బట్టలూదీసి కొడుతా అంటూ జర్నలిస్టులపై నోరుపారేసుకోవడం చూస్తే ఆయన మెంటల్ లేచిందేమోనని అనిపిస్తుందన్నారు. అసెంబ్లీ సాక్షిగా అలాంటి భాష మాట్లాడితే ఒక్క మేధావి గానీ, ఒక్క జర్నలిస్టు గానీ మాట్లాడడం లేదని, స్పీకర్ రికార్డుల నుంచి తొలగించాల్సిందిపోయి నవ్వుకుంటూ కూర్చున్నారని విమర్శించారు. నా కుటుంబం జోలికి వస్తే ఊరుకోను అనే రేవంత్‌రెడ్డి మాటలు ఆయా కుటుంబాలు బాధపడలేదా అని ప్రశ్నించారు. బడ్జెట్లో పెట్టడానికి డబ్బులు లేవు.. ఇచ్చిన హామీలు అమలు చేయడానికి చేతగాదు.. ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేరు.. వాటిని పక్కదారి పట్టించేందుకు కేసీఆర్, కేటీఆర్, జగదీశ్‌రెడ్డిని ఏదో ఒకటి అనడం చేతగానివాడు చేసే రాజకీయమన్నారు.
తెలంగాణ కోసం పార్టీ పెట్టి ఢిల్లీ వెళ్లి గల్లీ గల్లీ తిరిగి కనపడ్డోని కాళ్లు మొక్కి 14 ఏండ్లు ఉద్యమం చేసి ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ను స్ట్రేచర్ మీదకు పోయిండు.. మార్చురీకి పోతడని ఆయన చావు కోరుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇదేందని అడిగితే నేను పార్టీని తిట్టిన.. కేసీఆర్‌ను అనలేదని 24 గంటల్లో 24 అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. నాడు తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు సంకన చేరి స్టీఫెన్‌కు రూ.50లక్షల మూటను ఇచ్చి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్‌రెడ్డీ.. నువ్వా కేసీఆర్ గురించి మాట్లాడేదని దుయ్యబట్టారు. నోరు తెరిస్తే బూతులు తప్ప ఒక్క మాట సరిగ్గా లేదని, పొద్దుగాల లేచిన దగ్గరి నుంచి కేసీఆర్ జపం లేకపోవతే నీకు బతుకు లేదని మండిపడ్డారు. నోటికి ఏది వస్తే అది కాకుండా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో వేల ఎకరాలు ఎండిపోతున్నాయని, కన్నెపల్లి పంప్‌హౌస్ స్విచ్ వేస్తే కాళేశ్వరం నీళ్లు వచ్చే అవకాశం ఉన్నా ఇవ్వడం లేదని తెలిపారు. సమీక్షలు పెట్టడం తెలియని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో నీళ్లు రెడీగా ఉన్నాయి ఇవ్వండంటే చాతగాదు గానీ, దేవాదుల నుంచి తీసుకొస్తానంటున్నాడని.. ఎక్కడో ఒక చోట నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, నిరసనలు చేస్తావా? ప్రజాపాలన అన్న నీకు ఎందుకు భయమైతున్నదని సీఎంను ప్రశ్నించారు.
ఉస్మానియాలో ఉద్యమం చేస్తే కేసులు పెడుతామంటే భయపడబోమని, ఎన్నికల ముందు ఏం మాట్లాడారో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనించి తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాలని, చంద్రబాబుకు చెంచాలా పని చేస్తున్న ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, జీడి భిక్షం, బీఆర్ఎస్ ఆత్మకూర్.ఎస్ మండలాధ్యక్షుడు తూడి నర్సింహరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు, నాయకులు బొమ్మగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.
జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలి
ఈ నెల 20న సూర్యాపేటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరుగనున్న బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, మల్లయ్యయాదవ్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతారని, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, మండలాల అధ్యక్షులు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, గ్రామ గ్రామం నుంచి ముఖ్య నాయకులు హాజరు కావాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల సందర్భంగా వరంగ్‌లో ఏప్రిల్ 27న నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ విజయవంతంపైనా చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలో వచ్చిన కరువుతో సాగునీరు ఇవ్వకుండా కాళేశ్వరంలో నీళ్లున్నా కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందని నీళ్లు బంద్ చేసి రైతుల పంటలను తీరుపై, విద్యుత్, ప్రజల మౌలిక సమస్యలపై చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు.