యాదగిరిగుట్ట, జూలై 1 : త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 5న ఉదయం 10 గంటలకు యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశ్, రాష్ట్ర నాయకులు సూదగాని హరిశంకర్‌గౌడ్, కల్లూరి రామచంద్రారెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్టలోని గొంగిడి నిలయంలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన వ్యూహంపై సూచనలు చేస్తారని తెలిపారు.
ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనను ప్రజలు ఏవగించుకుంటున్నారన్నారు. గ్రామాల్లో రైతులు, సబ్బండవర్గాలకు చెందిన ప్రజలంతా కేసీఆర్ పాలనను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కడ చూసినా కరెంటు కష్టాలు, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఏ ఒక్క రైతుకు రైతు భరోసా నగదు జమకాలేదన్నారు. రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే బీఆర్ఎస్ పార్టీకి పట్టంకట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశానికి ఆలేరు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన పీఏసీఎస్ చైర్మన్లు, పాల సంఘం చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీలు, ప్రజాప్రతినిధులు, రైతు విభాగం కన్వీనర్లు, పార్టీ వివిధ విభాగాల నాయకులు, విద్యార్థి, యువజన, సోషల్ మీడియా నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతినక్షత్రం సందర్భంగా సామూహిక గిరిప్రదక్షిణలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొననున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి చెప్పారు. తెల్లవారుజామున 5.30 గంటలకు స్వామివారి వైకుంఠ ద్వారం వద్ద స్వామివారి కొండ చుట్టూ పాదయాత్రగా ప్రదక్షిణ చేయనున్నారు. అనంతరం గర్భాలయంలో నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్ గడ్డమీది రవీందర్‌గౌడ్, పార్టీ జిల్లా నాయకులు మిట్ట వెంకటయ్య, గుండ్లపల్లి వెంకటేశ్‌గౌడ్, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, మాజీ సర్పంచ్ కసావు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.