భువనగిరి అర్బన్, నవంబర్ 9 : బీఆర్ఎస్ భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి నామినేషన్ పర్వం గురువారం జాతరను తలపించింది. ముందుగా బీబీనగర్ మండలంలోని పడమటి సోమవారం సమీపంలో గల లింగబసవేశ్వరస్వామి ఆలయంలో, భువనగిరి మండలం పగిడిపల్లి సమీపంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో, పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నేరుగా భువనగిరి పట్టణంలోని ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ వేసే ముందు సెంటిమెంట్‌గా ఎమ్మెల్యే పైళ్ల సతీమణి వనిత ఎదురు రాగా ఆయన కార్యాలయంలోకి వెళ్లారు.
మాజీ ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులుతో కలిసి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆర్వో కార్యాలయం ముందు విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ప్రతిపక్ష పార్టీల మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ నియోజకవర్గంలోని దళితులందరికి దళితబంధు వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు.
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమం జాతరను తలపించింది. ప్రచార రథంపై ఆయనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, జిట్ట బాలకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, డీసీసీబీ డైరెక్టర్ బడుగుల లింగయ్యయాదవ్ పాల్గొన్నారు. ర్యాలీతో పట్టణమంతా గులాబీమయంగా మారింది. మహిళల నృత్యాలు, కోలాటాలు, డప్పు వాయిద్యాలు, బతుకమ్మ ఆటలు, విచిత్ర వేషధారణలతో జగదేవ్‌పూర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది.
స్థానిక వినాయక చౌరస్తాలో గజమాలతో ఎమ్మెల్యేను సన్మానించారు. ర్యాలీలో ఎమ్మెల్యే సతీమణి పైళ్ల వనిత, కూతురు మన్వితారెడ్డి, ర్యాలీలో భువనగిరి మారెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్టయ్య, ఎంపీపీ నారాల నిర్మలవెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, బీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ కిరణ్‌కుమార్, జనగాం పాండు, ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నీల ఓం ప్రకాశ్‌గౌడ్ పాల్గొన్నారు.