ఆత్మకూరు(ఎం), నవంబర్ 27 : గీత కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చేశారని బీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పీఎస్ గార్డెన్లో గుండాల, ఆత్మకూరు(ఎం), మోటకొండూర్ మండలాల గౌడ్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ కులవృత్తిదారులందరిని ఆదుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో గౌడ సంఘం భవనాలకు నిధులు మంజూరు చేశామని తెలిపారు.
నిరుద్యోగ యువత కోసం సొంత నిధులతో కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, చాలామంతి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. నిరంతరం ప్రజా సేవకే అంకితమై ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని మరోసారి అవకాశం కల్పించి ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రైతుబంధును ఇవ్వొద్దని ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలన్నారు.
మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ప్రతి గీతాకార్మికుడికి ఉచితంగా మోటర్ సైకిల్ అందజేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయిపాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కోకాపేటలో గౌడ సంఘం భవనం కోసం స్థలాన్ని కేటాయించి రూ.5కోట్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు.
ముచ్చటగా మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తేనే గౌడన్నల బతుకులు బాగుపడుతాయన్నారు. గౌడ్లందరూ ఎకతాటిపై ఉండి ఎమ్మెల్యేగా గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డీఎల్‌డీఏ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్, గౌడ సంఘం నాయకులు గడ్డమీది పాండరి, పంజాల వెంకటేశ్, లగ్గాని రమేశ్‌గౌడ్, సత్తయ్యగౌడ్, యాదగిరిగౌడ్, మల్లేశంగౌడ్, రాములుగౌడ్, బాలురాజుగౌడ్ పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట, నవంబర్ 27 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులొచ్చి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే కనిపించకుంటా పోతారని.. తస్మాత్ జాగ్రతగా ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ప్రజలంతా అభివృద్ధి గమనించి కారుగుర్తుకు ఓటేయాలని కోరారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాదగిరిగుట్ట ఆలయాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి పరిస్తే, మంత్రి కేటీఆర్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారన్నారు.
తాము గుట్ట చుట్టూ ఒక్క గుంట భూమి కబ్జా చేసిన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని టీపీసీసీ చైర్మన్ రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. రైతు బంధు, 24 గంటల కరెంట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్ కొనసాగాలంటే సీఎం కేసీఆర్‌కు ఓటేయ్యాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, కో ఆప్షన్ సభ్యురాలు గోర్ల పద్మ, నాయకులు కళ్లెం స్వాతిగౌడ్ పాల్గొన్నారు.