ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం తీసుకు రావడంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. 16వ శతాబ్దం నాటి చెన్నకేశవ స్వామి ఆలయంతోపాటు 18వ శతాబ్దం నాటి మెట్లబావి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మెట్లబావి పూడిక తీత పనులుకొనసాగుతుండగా, త్వరలో సుందరీకరణ పనులు చేపట్టనున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం మంత్రి జగదీశ్‌రెడ్డి పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి, పురావస్తుశాఖ అధికారులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ చరిత్ర, విశేషాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని గణపతి విగ్రహం 8వ శతాబ్దం నాటిదని గుర్తించారు. చారిత్రక చెన్నకేశవ స్వామి ఆలయాన్ని సరికొత్తగా రూపుదిద్ది, పర్యాటకంగా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు.
చెన్నకేశవ స్వామి ఆలయానికి పూర్వ వైభవం
ఆత్మకూర్.ఎస్, సెప్టెంబర్ 19 : చారిత్రక ప్రదేశాలకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని చెన్నకేశవస్వామి ఆలయం వెలుపల ఉన్న మెట్ల బావిని పురావస్తు శాఖ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఆలయంలో కొలువై ఉన్న చెన్నకేశవస్వామి విగ్రహం క్రీస్తు శకం 16వ శతాబ్ధం నాటిదని మహా మండపంలో ఇరువైపులా ఉన్న అల్వార్ విగ్రహాలు 18వ శతాబ్దం నాటివని, రాతి స్తంభాలతో ఉన్న ముఖ మండపం కూడా 18వ శతాబ్ధం నాటిదని పురవాస్తు శాఖ అధికారులు తేల్చి చెప్పారు.
మెట్ల బావికి 13వ శతాబ్ధం నాటి కాకతీయ స్తంభాలు..
మెట్ల బావికి పూర్వ వైభవం తెచ్చేందుకు తిరిగి బావిని పునరుద్ధరించడానికి మంత్రి జగదీశ్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే పూడికతీత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పురావస్తు పరిశోధకుడు క్లీన్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి, పురావస్తు శాఖ అధికారి వెంకట్రామిరెడ్డి, ఇతర అధికారుల పరిశీలనలో అబ్బురపరిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
18వ శతాబ్ధంలో నిర్మించిన మెట్ల బావి నిర్మాణంలో 13వ శతాబ్ధంలో కాకతీయులు తయారు చేసిన రాతి స్తంభాలను వాడినట్లు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. స్తంభాలపై ఉన్న శృంగారపు శిల్పాలు చరిత్రలను ధ్రువీకరిస్తున్నాయన్నారు. నిర్మాణం జరుపుకుని 300 ఏండ్లు అవడంతో శిథిలావస్థకు చేరిన మెట్ల వరుసలు వంకరలు తిరిగి కొన్ని మెట్లు భూమిలోకి కుంగిపోయినట్లుగా పరిశీలనలో తేలింది. మెట్ల బావికి పక్కనే ఉన్న సత్రపు మండపం కూడా అక్కడక్కడ కుంగుబాటుకు గురైనట్లు గ్రహించారు. సత్రపు మండపం ఆగ్నేయ భాగంలో ఉన్న ఒక అంకనం సిమెంట్‌తో నిర్మితమైనందున మిగతా అంకనాల మాదిరిగా రాతితో పునరుద్దరించాలని మంత్రి ఆదేశించారు.
వెలుగులోకి 1,200 ఏళ్ల నాటి గణపతి విగ్రహం..
పురావస్తు శాఖ అధికారులతో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి ఆత్మకూర్.ఎస్ గ్రామంలో జరిపిన పరిశీలనలో అతి పురాతన కాలంనాటి గణపతి విగ్రహాన్ని గుర్తించారు. విగ్రహాన్ని పరిశీలించిన నాగిరెడ్డి బృందం 8వ శతాబ్ధం నాటి విగ్రహంగా తేల్చి చెప్పారు. 1,200 ఏండ్ల చరిత్ర ఈ విగ్రహానికి ఉన్నదని మంత్రికి వివరించారు. చారిత్రక ఆధారాల ద్వారా ఆత్మకూర్.ఎస్ గ్రామం చరిత్ర ఇప్పటికి 1,200 సంవత్సరాల నాటిదని మంత్రికి వివరించారు.
అనంతరం పురావస్తు శాఖ అధికారులతో కలిసి గ్రామంలో ఉన్న వారసత్వ కట్టడాలు, శకలాలను పరిశీలించిన మంత్రి వాటి పునరుద్ధరణ ద్వారా చారిత్రక వైభవాన్ని గ్రామంలో తిరిగి నెలకొల్పుతామని చెప్పారు. చారిత్రక గణపతి విగ్రహం రోడ్డు కంటే మూడు అడుగుల లోతులో ఉన్నందున రోడ్డుపై మూడు అడుగుల ఎగువన పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు. మెట్ల బావి పునరుద్ధరణ కార్యక్రమాలు వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మంత్రి వెంట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, ఎంపీపీ మర్ల స్వర్ణలతాచంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నరసింహారావు, బత్తుల ప్రసాద్, సర్పంచ్ తంగెళ్ల వీరారెడ్డి, ఎంపీటీసీ మిర్యాల వెంకట్‌రెడ్డి, మల్లారెడ్డి, నంద్యాల వీరారెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు తంగెళ్ల మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.