రామగిరి, సెప్టెంబర్ 11 : దేశంలోనే అత్యంత నాణ్యమైన దూర విద్యను అందిస్తున్న డా.బిఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందించే ఉన్నత విద్య అవకాశాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఏఓయూ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ అన్నారు. గురువారం నల్లగొండలోని బీఆర్ఏఓయూ స్టడీ సెంటర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్టైఫండ్ ఆధారిత విద్యా కార్యక్రమం (ఎన్టీసీ) తో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను అప్రెంటిషిప్లు, చదువుతో పాటు, గ్రామీణ, గిరిజన విద్యార్థులకు స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సులను కూడా స్వామి రామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్ ద్వారా ప్రతి సంవత్సరం 3 వేల మంది గ్రామీణ, గిరిజన విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
అంతేకాకుండా తెలంగాణలో గోండు కోయ, చెంచు ఆదివాసులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం యూనివర్సిటీ అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు. We Hub ద్వారా, We Enable కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తెచ్చి చదువుకునే దశలోనే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని యూనివర్సిటీ సరికొత్త కోర్సులను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.శ్రీనివాస రాజు, బీఆర్ఏఓయూ నల్లగొండ రీజినల్ కో ఆర్డినేషన్ సెంటర్ కో ఆర్డినేటర్ డా. బొజ్జ అనిల్‌కుమార్, ఉమెన్స్ కళాశాల రాజారాం, ఆధ్యాపకులు పాల్గొన్నారు.