రామగిరి, మే 07 : సాహిత్య రంగానికి బోయ జంగయ్య చేసిన సేవలు మరువలేనివి పలువురు కవులు, రచయితలు అన్నారు. తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో ప్రముఖ తెలంగాణ కవి, రచయిత డాక్టర్ బోయ జంగయ్య వర్ధంతి సభ గురువారం ఉదయం నల్లగొండలోని యూటీఎఫ్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా బోయ జంగయ్య చిత్రపటానికి నల్లగొండ జిల్లా కవులు, రచయితలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త మేరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. బోయ జంగయ్య మారూముల గ్రామంలో అతి నిరుపేద కుటుంబంలో జన్మించి దళితుడిగా వివక్షను ఎదుర్కొని ఎంతో కష్టపడి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాడన్నారు.
అంతేకాకుండా ఒక రచయితగా సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను తన రచనల ద్వారా తొలగించడానికి ప్రయత్నం చేసిన సంఘ సంస్కర్తని, కవిగా, రచయితగా, నాటక రచయితగా, బాల సాహితీవేత్తగా బహుముఖీన ప్రతిభను రచనారంగంలో ప్రదర్శించి తనదైన స్థానాన్ని తెలుగు సాహిత్యంలో సంపాదించారన్నారు. ఆయన రాసిన జగడం నవల రజాకార్ల దురాగతాలను దేశ్ ముఖుల పెత్తందార్ల దౌర్జన్యాలను ఎండ కట్టారని, ఆయన రచనలలో మట్టి వాసనలు గ్రామీణ జీవితాలు ప్రతిబింబించేవని, ఆయన రచనలను ఎనిమిదవ తరగతి పాఠ్య పుస్తకంలో ప్రచురించారని, ఆయన చేసిన సాహితీ సేవలకు గుర్తింపుగా నల్లగొండలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలన్నారు.
ప్రముఖ సాహితీవేత్త సినీ విమర్శకులు డాక్టర్ ఎం.పురుషోత్తమచార్య మాట్లాడుతూ. రచయితగా గొప్ప స్థానాన్ని పొందాలని దళిత స్పర్శ దళిత సాహిత్యాన్ని విస్తృత పరిచారని మానవీయ కోణంలో ఆయన రచనలు అందరికీ స్ఫూర్తిని కలిగించాయన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి పున్న అంజయ్య మాట్లాడుతూ.. బోయ జంగయ్య జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉంటూ జిల్లా మహాసభలను విజయవంతం భావించడంలో ఎంతో కృషి చేశారన్నారు. నిజాయితీతో కూడిన విభజన ఉద్యోగిగా సమాజానికి సేవలందించారని, రచయితగా తన రచనల ద్వారా ఏ విలువల అయితే విలువలకు కట్టుబడ్డ వ్యక్తి బోయ జంగయ్య అన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట తెలుగు శాఖ అధ్యక్షుడు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ.. రచయితగా అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తి బోయ జంగయ్య అన్నారు. జిల్లాలో అంతటి ప్రతిభావంతులైన రచయిత జన్మించడం జిల్లాకే గర్వకారణమని తెలిపారు. వారి సమగ్ర సాహిత్యాన్ని తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ సాహిత్య అకాడమీ పైన ఉందని, ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన రచనల ద్వారా తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జీవకవి మునాసు వెంకట్, డాక్టర్ పగడాల నాగేందర్, భూతం ముత్యాలు, డాక్టర్ మహమ్మద్ హసేన, డాక్టర్ సాగర్ల సత్తయ్య, శీలం భద్రయ్య, బండారు శంకర్, దున్న యాదగిరి, దర్శనం అంజయ్య, డాక్టర్ చింతోజు మల్లికార్జున చారి, ఎలికట్టె శంకర్రావు, దాసరి శ్రీరాములు, బూర్గు గోపికృష్ణ, తరుణోజు భీష్మాచార్య, బోయ జంగయ్య కుమారులు చేతన్, సిద్ధార్ద్, నామా వెంకటేశ్వర్లు, మధుసూదన్ పాల్గొన్నారు.