రామగిరి, జూలై 11 : అన్ని కళాశాలల్లో యూనివర్సిటీ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, బయోమెట్రిక్ విధానంలో విద్యార్థుల హాజరు నమోదు చేయడంతో పాటు 75 శాతం హాజరు ఉండేలా చూడాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో శుక్రవారం సమావేశం నిర్వహించారు. దోస్త్ ద్వారా భర్తీ అయిన అడ్మిషన్లు, విద్యార్థులకు అందుతున్న విద్య, కో కరిక్యూలమ్ యాక్టివిటీస్ అంశాలపై సమావేశంలో వీసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు డిగ్రీ స్థాయిలోనే నాణ్యమైన, గుణాత్మక విద్యనందిస్తే విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసిన వారమౌతామన్నారు. ఆ దిశగా ప్రమాణాలు పాటిస్తూ బోధన సాగించాలని సూచించారు.
వర్సిటీ సూచించిన సిలబస్‌ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. అదే విధంగా ప్రాజెక్టులను సహితం పూర్తి చేయాలన్నారు. 20 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు అయిన కోర్సుల్లో చేరిన విద్యార్థులను ఇతర యూనివర్సిటీకి బదిలీ చేయాలని ఆదేశించారు. అన్ని కళాశాలల్లో యూనివర్సిటీ నిబందనల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆయా కళాశాలల పరిధిలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని సామాజిక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. అదే విధంగా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు నిర్వహించే క్రీడా పోటీల్లో విద్యార్థులు పాల్గొనేలా ప్రొత్సహించాలని, క్రీడల్లో సహితం యూనివర్సిటీ ఖ్యాతి చాటాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై.ప్రశాంతి, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.జయంతి, ఉమ్మడి జిల్లాలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.