సంస్థాన్ నారాయణపురం : అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలో ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కూసుకంట్ల ప్రభాకర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యామ మల్లేశ్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రగల్బాలు పలికి ఇప్పుడు గాలి ముచ్చట్లు చెబుతున్నారని విమర్శించారు.
ఎంపీ ఎన్నికల్లో పోటీలో ఉన్న 37మందిలో ఒక్క కేసు కూడా లేని వ్యక్తిని తానేనని తెలిపారు. అధికారం కోసం పూటకో పార్టీ మార్చే రాజగోపాల్ రెడ్డి రాజకీయ బ్రోకర్ అని ఎద్దేవా చేశారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి అవుతాడని పగటి కలలు కంటున్నాడని, ఆయన జీవితంలో మంత్రి కాలేడని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అంగట్లో పశువులను కొన్నట్లు కొంటున్నారని, కొంత మంది పోయినంత మాత్రనా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని తెలిపారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఎన్నికల ఇన్చార్జి వెంకట్నారాయణ గౌడ్, మండల కన్వీనర్ నర్రి నరసింహ, వైస్ ఎంపీపీ రాజునాయక్, ఎంపీటీసీలు దోటి జంగయ్య, గడ్డం పెంటయ్య, ఈసం యాదయ్య, నరేశ్ పాల్గొన్నారు.