అర్వపల్లి, ఏప్రిల్ 24 : భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. గురువారం అర్వపల్లి మండల కేంద్రంలోని ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. సాదా బైనమాలతో గతంలో భూములను కొనుగోలు చేసిన రైతులకు భూ భారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కరించబోతున్నామని చెప్పారు.
అలాగే ప్రభుత్వ భూముల అన్యక్రాంతంపై పోర్టల్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించి భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణు మాధవరావు, తాసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ఎంపీడీఓ గోపి, ఏఓ గణేశ్, ఆర్ఐ వెంకట్ రెడ్డి, మండల వైద్యాధికారి నగేశ్నాయక్, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, గుడిపెల్లి మధుకర్, వెంకట్ రెడ్డి, సైదులు, మహారాజు, వివిధ మండలాల తాసీల్దార్లు, అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.