హుజూర్నగర్, ఏప్రిల్ 28 : భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చినట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. సోమవారం హుజూర్నగర్ పట్టణంలోని స్వర్ణ వేదిక ఫంక్షన్ హాల్ నందు రైతులకు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ద్వారా రైతులు తమ భూముల సమస్యలు సులువుగా పరిష్కరించుకోవచ్చన్నారు. భూ భారతి చట్టంపై రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికే అవగాహన సదస్సులు నిర్వహిస్తుస్తున్నట్లు తెలిపారు. ప్రతి కమతానికి భూధార్ కార్డును కేటాయించి దీనిలో హద్దులతో కూడిన మ్యాప్ పొందుపరచనున్నట్లు చెప్పారు. అలాగే భవతి చేసేటప్పుడు కుటుంబంలోని ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చి ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు వెల్లడించారు.
గతంలో జరిగిన కమిటేషన్లపై అప్పిల్ చేసుకునేందుకు ధరణిలో అవకాశం లేదని కానీ భూభారతిలో ముటేషన్ల పై అభ్యంతరాలు ఉంటే రెండు అంచెలుగా అప్పిల్ చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. త్వరలో జిల్లాకు ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి, పరిశీలించిన పిదప జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు తీసుకుని అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు. ముందుగా ఆర్డీఓ శ్రీనివాసులు భూ భారతి చట్టంలోని ఒక్కొక్క అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేశ్ముఖ రాధిక అరుణ్ కుమార్, డీసీసీబీ డైరెక్టర్ డి.వెంకటేశ్వర్లు, డీఏఓ రాజేందర్ రెడ్డి, ఏడీఏ రవి, ఇన్చార్జి తాసీల్దార్ నాగేందర్, ఎంపీడీఓ లావణ్య, పీఏసీఎస్ చైర్మన్లు శౌరరెడ్డి, జి.నాగేందర్, గోపాలరావు పాల్గొన్నారు.