రామగిరి, మార్చి 20 : గత ఐదు సంవత్సరాలుగా కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణం వాటిని విడుదల చేయాల్సిందిగా కోరుతూ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని బీఏఐ స్టేట్ చైర్మన్ యు.సురేందర్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డి.వి.ఎన్.రెడ్డి ఈ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారు. గత ఐదు సంవత్సరాలుగా (2021 నుండి) కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం మారి 27 నెలలు గడిచినా ఇప్పటికీ ఈ బకాయిలు చెల్లించబడలేదన్నారు. ఈ పరిస్థితి కాంట్రాక్టర్లను తీవ్రమైన ఆర్థిక కష్టాల్లోకి నెట్టిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కాంట్రాక్టర్లు నేడు అప్పుల పాలై, జీవితంతో పోరాడే పరిస్థితికి చేరుకున్నారని, ఇది చాలా ఆందోళనకర విషయం అన్నారు.
ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక కాంట్రాక్టర్ ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు అవసరం అన్నారు. రూ.3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్‌ను ప్రకటించే రాష్ట్రంలో ప్రభుత్వ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు తమ బకాయిల కోసం ఎదురుచూడటం బాధాకరమన్నారు. మరోవైపు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో R&B అలాగే PR శాఖల్లో పాత, కొత్త బిల్లులు చెల్లించబడటం గమనార్హం అన్నారు. అభివృద్ధికి తోడ్పడే కాంట్రాక్టర్లను నిర్లక్ష్యం చేయడం రాష్ట్రానికి అనుకూలం కాదని, తమ సమస్యలపై స్పందించి నిర్ధిష్ట గడువులోగా అన్ని పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిందిగా కోరారు.