పెద్దఅడిశర్లపల్లి, జూన్ 18 : సమైక్య పాలనలోని ఫ్లోరైడ్ పాపాన్ని పారదోలి ప్రతి ఇంటికీ సురక్షిత జలాలు అందిస్తున్న మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని కోదండాపురం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద ఆదివారం మంచినీళ్ల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత పాలనలో ఈ ప్రాంతానికి తాగునీరు అందించకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తే ప్రజలు అడ్డుకున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రతి గిరిజన తండా, మూరుమూల గ్రామాలకు సైతం మిషన్ భగీరథ జలాలు అందిస్తున్నారని తెలిపారు. దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీటితో కాళ్లు, చేతులు వంగిపోయి జీవచ్ఛవంలా మారినా గత పాలకులు శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు. మిషన్ భగీరథతో సీఎం కేసీఆర్ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారన్నారు.
నాడు చెలిమెల నీళ్లే దిక్కయ్యాయి
దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
గతంలో గిరిజన తండాల్లో నీళ్లులేక వాగులు, చెలిమల నీళ్లే దిక్కయ్యాయని, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కృష్ణానది నుంచి నెత్తిన బిందెలు మోసుకుంటూ గుట్టలపైకి తీసుకొచ్చారని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. నేడు ప్రతి మూరుమూల గిరిజన తండాకు సురక్షిత జలాలు అందిస్తున్నామని తెలిపారు. గతంలో గ్రామాలకు వెళ్తే ఖాళీ బిందెలతో స్వాగతం పలికేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ రాంచందర్‌నాయక్, ఆర్డీఓ గోపీరాం, గుర్రంపోడు ఎంపీపీ పాల్వాయి వెంకటేశ్వర్లు, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సిం హ, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, ముచ్చర్ల ఏడుకొండల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.