అర్వపల్లి, సెప్టెంబర్ 15 : గర్భిణులు చేయాల్సిన వ్యాయామాలు, తీసుకోవాల్సిన ఆహార పదార్థాలపై డాక్టర్ భూక్య నగేశ్ నాయక్ అవగాహన కల్పించారు. అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. గర్భిణీలు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళ తేలికపాటి వ్యాయామాలు చేయాలన్నారు. ఎలాంటి పౌష్టిక ఆహారం తీసుకోవాలో వివరించారు. సహజ కాన్పు ద్వారా కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు జరిగితే చేకూరే లబ్ధి వివరాలు తెలిపారు. క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచిత పరీక్షలు, మందులు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎపిడమలాజిస్ట్, డాక్టర్ ఆకుల సతీష్, సామాజిక అరోగ్య అధికారి మాలోతు బిచ్చు నాయక్, సూపర్ వైజర్, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, గర్భిణీలు పాల్గొన్నారు.