నల్లగొండ సిటీ, జూన్ 13 : రైలు కిందపడి ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన నల్లగొండ సమీపంలోని కేశరాజుపల్లిలో గల రైల్వే ట్రాక్‌పై శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన గోశెట్టి నిశాంత్ (30) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గతకొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లోని మీర్‌పేటలో ఆటో నడుపుతున్న సమయంలో ఓ హిజ్రాతో పరిచయం ఏర్పడి తనను వివాహం కూడా చేసుకున్నాడు. ఇరువురు ఇంటికి రాగా నిశాంత్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన హిజ్రా మీర్‌పేటకు వెళ్లిపోయి అక్కడే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసు ఇటీవలే కొట్టేసినట్లు బంధువులు తెలిపారు.
కాగా వారం రోజుల క్రితం నిశాంత్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లాడు. కుమారుడి ఆచూకీ కోసం గాలించిన తల్లిదండ్రులు ఫలితం లేకపోవడంతో గురువారం సాయంత్రం నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంతలోనే నిశాంత్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. నిశాంత్ రెండేండ్ల క్రితం తన మేనమరదల్ని పెండ్లి చేసుకున్నాడు. వారికి ఏడాది వయస్సు ఉన్న బాబు ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.