నీలగిరి, మే 22 : రానున్న మూడు రోజులపాటు సాధారణ, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. జిల్లా నుండి మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు అధికారులందరూ విధుల్లో ఉండాలని చెప్పారు. ఎక్కడైనా వర్షాల కారణంగా పిడుగులు పడి ప్రాణ, ఆస్తి నష్టం వంటివి జరిగితే తక్షణమే సమాచారం అందించాలన్నారు. గురువారం జిల్లా అధికారులతో కలెక్టర్ వివిధ అంశాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిషన్ భగీరథ, విద్యుత్, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి తాగునీటి వ్యవస్థకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లకుండా ముందుగానే అప్రమత్తం చేయాలన్నారు.
పిడుగులు పడి పశువులు, మనుషులు చనిపోకుండా ముందు జాగ్రత్తగా అవగాహన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా, అనుమతి లేకుండా ఎవరు సెలవుల్లో వెళ్లవద్దన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి ధాన్యం తడవకుండా తక్షణమే ధాన్యాన్ని మిల్లులకు పంపించాలని, ఇంకా ఎక్కడైనా ధాన్యం వస్తున్నట్లయితే టార్పాలిన్లతో కప్పి ఉంచి ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను బ్యాంకర్లు తక్షణమే పరిశీలించి ఎంపీడీఓలకు పంపించాలని ఆదేశించారు. వర్షం కారణంగా విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు .అలాగే చెరువులు, రోడ్లు, ఇతర ప్రభుత్వ ఆస్తులకు ఎక్కడైనా నష్టం వాటిల్లినట్లైతే తక్షణం సమాచారం అందించాలని పేర్కొన్నారు.