మిర్యాలగూడ టౌన్, మార్చి 21 : ఆస్తి పన్ను వసూళ్లకై అధికార యంత్రాంగం కదిలింది. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలోని మొండి బకాయిదారుల (టాప్-100) లిస్ట్‌తో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, తాసీల్దార్ హరిబాబు, మున్సిపల్ కమిషనర్ ఎండీ.యూసుఫ్ పట్టణంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పన్ను వసూళ్లను ముమ్మరం చేశారు. ఇప్పటికే నోటీసులు అందుకుని చెల్లించకుండా కాలయాపన చేస్తున్న యజమానుల ఆస్తులను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ మాట్లాడుతూ.. పట్టణవాసులు పన్ను చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. మున్సిపాలిటీలో 15వ ఆర్థిక సంఘం నిధులు జమ కావాలంటే నిర్దేశించిన పన్ను రూ.10 కోట్లను వసూలు చేయాల్సిందేనన్నారు. ఇప్పటివరకు రూ.7 కోట్లు సేకరించామని ఆర్థిక సంవత్సరం ముగింపునకు 10 రోజుల సమయమే ఉన్నందున రోజుకు రూ.30 లక్షల టార్గెట్ పెట్టుకుని పన్ను వసూలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.