నీలగిరి, సెప్టెంబర్ 17 : తల్లీబిడ్డల ఆరోగ్యంపై అంగన్వాడీలు ప్రత్యేక దృష్టి సారించాలని నల్లగొండ జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి కేవీ కృష్ణవేణి అన్నారు. నల్లగొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోషణ్ బీ – పడాయి బీ కార్యక్రమంపై అంగన్వాడీ టీచర్లకు మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లు తమ సర్వేలో ఉండే మహిళలపై ప్రత్యేక దృషి పెట్టాలన్నారు. తమ సర్వేలో గర్భిణీలను త్వరగా రిజిస్ట్రేషన్ చేసి వారికి పౌష్టికాహారం అందించాలన్నారు. గర్భం దాల్సిన నాటి నుండి ప్రసూతి అయి పిల్లలు స్కూల్కు వెళ్లేంత వరకు వారికి నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు వారి ఆరోగ్యం, పిల్లలు వచ్చాక పిల్లల ఆరోగ్యం, వారు వయస్సుకు తగిన బరువు, ఎత్తు పెరుగుతున్నారా లేదా ప్రత్యేకంగా గుర్తించాలన్నారు.
చిన్నారులకు ఆహారంతో పాటు విద్యను కూడా అందించాలని సూచించారు. చదువు పట్ల అక్షరాలను గుర్తించేలా ప్రీస్కూల్ కార్యక్రమాలు చేయించాలన్నారు. చిన్నారులకు శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి ప్రీస్కూల్ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తూ వెనకబడిన పిల్లలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలన్నారు. ప్రతి బిడ్డ సమగ్రంగా ఎదగాలంటే టీచర్లుగా మీవంతు కృషి అవసరమని వివరించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ తూముల నిర్మల, సూపర్వైజర్లు పార్వతి, జయమ్మ, మల్లేశ్వరి, లక్ష్మమ్మ, మంజుల, శ్రీలత, పద్మ, సరస్వతి, ప్రణీత, వినోదకుమారి, స్వరూప, పోషణ్ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ సతీశ్, అంగన్వాడీ కేంద్రాల టీచర్లు పాల్గొన్నారు.