నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), మే 12 : శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధికి తన పరిశోధనలతో విశేషమైన కృషికి గుర్తింపుగా నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్సరల్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఏఎస్‌టీసీ (అకాడమీ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్, హైదరాబాద్) ఫెలోషిప్ లభించింది. ఐఐసీటీ హైదరాబాద్ వేదికగా సోమవారం ఏఎస్‌టీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శాస్త్రవేత్తల కృషి వారి చేస్తున్న పరిశోధనలను ఉద్దేశించి మాట్లాడి అభినందించారు. అనంతరం ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఫెలోషిప్‌ను అందుకున్నారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. తన ప్రొఫెసర్ కెరీయర్లో చేసిన పరిశోధనల ఫలితమే ఫెలోషిప్ అన్నారు. ఎంజీయూకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. తమ అధ్యాపకులు సైతం ఉత్తమమైన పరిశోధనలకు స్ఫూర్తిగా నిలుస్తున్నట్లు చెప్పారు. 2016 నుంచి 2019 వరకు ఎంజీయూలో పరిశోధనల అభివృద్ధితో పాటు ఎన్నో అంశాలకు వీసీగా కృషి చేసినట్లు తెలిపారు. తిరిగి మరలా ఎంజీయూ వీసీగా పనిచేసే అవకాశం దక్కడం అదృష్టం అన్నారు. అన్ని విభాగాల్లో పరిశోధనలను ప్రోత్సహించడంతో పాటు విద్యార్థులను సైతం ఆ దిశగా అడుగులు వేసేలా మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, ఇన్ఫ్రాస్ట్రక్షర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై.ప్రశాంతి, అసిస్టెంట్ డాక్టర్ జయంతి, సీఓఈ డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డితో పాటు వివిధ విభాగాల అధికారులు, అధ్యాపకులు ఉపకుల పతికి శుభాకాంక్షలు తెలిపారు.
MGU : ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్‌కు ఏఎస్‌టీసీ ఫెలోషిప్