నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే మునుగోడు ప్రజాదీవెన సభకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మునుగోడు మండల కేంద్రం నుంచి నారాయణపురం రోడ్డులోని ఎంపీడీఓ కార్యాలయం దాటాక విశాలమైన స్థలంలో సీఎం సభను నిర్వహించాలని నిర్ణయించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి సభా స్థలానికి ఈజీగా చేరుకునేలా స్థలాన్ని ఎంపిక చేశారు. టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయనతోపాటు మంగళవారం ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. సభాస్థలాన్ని చదును చేసే పనులను ముమ్మరంగా చేస్తూనే పార్కింగ్ స్థలాలపైనా దృష్టి సారించారు. సభకు మూడ్రోజులే మిగిలి ఉండడంతో ఏర్పాట్లను వేగవంతం చేశారు. మరోవైపు సభకు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించేలా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో మండలాల వారీగా ఇన్చార్జిలు గులాబీ శ్రేణులతో మమేకమవుతున్నారు. గ్రామాల వారీగానూ సమావేశాలు నిర్వహిస్తూ సభ విజయవంతంపై దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తున్నది.
మునుగోడు నియోజకవర్గం అంతటా రాజకీయ సందడి నెలకొంది. ఈ నెల 20న మధ్యాహ్నం 2 గంటలకు మునుగోడులో నిర్వహించనున్న ప్రజాదీవెన సభకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరవుతున్న విషయం తెలిసిందే. సభను విజయవంతం చేయడం ద్వారా మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్తోనే ముడిపడి ఉందని చాటి చెప్పేందుకు పార్టీ యావత్తు రంగంలోకి దిగింది. ఈ సభ ద్వారా ఈ ప్రాంత అభివృద్ధిపై భరోసా కల్పించాలన్నది టీఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తున్నది. సీఎం కేసీఆర్ సభకు ఊరూవాడ నుంచి జనం తరలివచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. క్షేత్ర స్థాయిలోనూ భారీగా జనం తరలివచ్చే పరిస్థితులు కనిపిస్తుండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లపై దృష్టి సారించారు. మునుగోడు మండలం కేంద్రంలో అన్ని వైపుల నుంచి సులువుగా సభాస్థలానికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభాస్థలం కోసం 40 ఎకరాలను ఎంపిక చేశారు. ఈ స్థలాన్ని చదును చేసే పనులను సోమవారం మొదలు పెట్టగా ప్రస్తుతం పూర్తి కావచ్చాయి. సభకు హాజరయ్యే వారు కూర్చునేందుకు, లోపలికి సులువుగా ప్రవేశించేలా దారులు ఇలా అనేక జాగ్రత్తలతో ఏర్పాట్లు చేస్తున్నారు.
పార్కింగ్ కోసం స్థలాల ఎంపిక
వాహనాల పార్కింగ్‌పైనా ప్రత్యేక దృష్టి సారించారు. మునుగోడుకు మూడు వైపులా సుమారు వంద ఎకరాల్లో పది చోట్ల పార్కింగ్‌కు స్థలాలను ఎంపిక చేశారు. అవసరాన్ని బట్టి మరిన్ని పార్కింగ్ స్థలాలను కూడా గుర్తించారు. సభకు వచ్చే వారు తమ వాహనాలను ఆయా పార్కింగ్ స్థలాల్లో నిలిపి సులువుగా సభాస్థలానికి చేరుకునేలా చూస్తున్నారు. చౌటుప్పల్, నారాయణపురం, మర్రిగూడెంతో పాటు కొత్తగా ప్రతిపాదించిన గట్టుప్పల్ మండలాల వారు కొంపల్లి వైపు నుంచి, నాంపల్లి, చండూరు మండలాల వారు చండూరు రూట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా పార్కింగ్ స్థలాలను అందుబాటులోకి తెస్తున్నారు. స్థలాలను చదును చేసే పూర్తయితే షామియానాలు, వేదిక నిర్మాణం, వీఐపీ, మీడియా, ప్రజాప్రతినిధుల వారీగా గ్యాలరీల ఏర్పాట్లు వంటి వాటిపై దృష్టి సారించనున్నారు. సభకు హాజరయ్యే వారి కోసం మంచి నీరు, మజ్జిగ ప్యాకెట్లను విస్త్రతంగా అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. సభకు వచ్చే వారికి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న గ్యాదరి బాలమల్లు వివరించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి డైరెక్షన్లో సభ, ఏర్పాట్లు, పార్కింగ్, ఇతర పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
క్షేత్రస్థాయిలో గులాబీ దళం సందడి
సీఎం సభకు విస్త్రత ప్రచారం కల్పిస్తూ క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పకడ్బందీగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. సభ ప్రాముఖ్యతను వివరిస్తూ పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసే కార్యాచరణ ముమ్మరంగా సాగుతున్నది. మంత్రి జగదీశ్‌రెడ్డి సారధ్యంలో ఇప్పటికే మున్సిపాలిటీలు, మండలాల వారీగా జిల్లా ప్రజాప్రతినిధులు ఇన్చార్జిలు రంగంలోకి దిగారు. మండలాల వారీగా సమావేశాలు పూర్తి చేసి ప్రస్తుతం గ్రామాల వారీగా పార్టీ శ్రేణులతో భేటీ అవుతున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా మండలాల వారీగా ఇన్చార్జిలతో కలిసి ఇప్పటికే ఒ దఫా సమావేశాల్లో పాల్గొన్నారు. రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసిన క్రమంలో నిర్వహిస్తున్న ఈ సభ ప్రాముఖ్యతపై ముందుగా మండలాల వారీగా ముఖ్య నేతలకు స్పష్టతనిస్తున్నారు. 2014 కంటే ముందు మునుగోడు పరిస్థితికి, ఆ తర్వాత టీఆర్ఎస్ హయంలో జరిగిన ప్రగతిని వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సూచిస్తున్నారు. 2018లో రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ఆయన వ్యవహారశైలితో మునుగోడు ప్రజలు ఏలా నష్టపోయారన్నది కూడా వివరిస్తూ సభ ప్రాముఖ్యతను చాటిచెప్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదే సమయంలో సభకు ప్రజలు తరలిరావడానికి వాహనాలను సమకూర్చుకోవడంపైనా దృష్టి సారించారు. సొంత వాహనాలతో పాటు అద్దె వాహనాలపై ఆరా తీస్తూ ఇప్పటికే వీటిని బుక్ చేసే పనిని వేగవంతం చేశారు. ఆయా గ్రామాల వారీగా సభకు వచ్చే వారి సంఖ్యకు అనుగుణంగా వాహనాలను సమకూర్చుకోవాలని స్థానిక నేతలకు సూచిస్తున్నారు. సీఎం సభ సక్సెస్ కోసం మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఇన్చార్జిలుగా ఉన్న ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీతా, రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్‌కుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్ క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులతో భేటీ అవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. దాంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీఆర్ఎస్ పార్టీ సందడి నెలకొంది. పార్టీ శ్రేణులు కూడా రెట్టించిన ఉత్సాహంతో సీఎం సభకు సన్నద్ధమవుతున్నారు. సభకు భారీగా తరలివచ్చి మునుగోడును గులాబీ అడ్డగా నిరూపించాలన్న పట్టుదలను ప్రదర్శిస్తున్నారు.
సభా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
మునుగోడు, ఆగస్టు 16 : ఈ నెల 20న మునుగోడులో జరుగనున్న ప్రజాదీవెన సభా స్థలాన్ని నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మంగళవారం పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్, ఇతర ఏర్పాట్లపై పోలీసులకు సూచనలు చేశారు. సభ రోజున వాహనాల రద్దీని నియంత్రించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సభకు హాజరయ్యే వారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు. ఆమె వెంట నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి, మర్రిగూడ జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్ఐ సతీశ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుశోత్తంరెడ్డి ఉన్నారు.