రామగిరి, ఆగస్టు 07 : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వివిధ విభాగాలకు వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాల మేరకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు(బీఓఎస్) ను నియమిస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంజీయూకు చెందిన సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డిని బిజినెస్ మేనేజ్మెంట్ విభాగానికి బీఓఎస్‌గా, సోషల్ వర్క్ విభాగానికి డాక్టర్ శ్రీధర్ (ఉస్మానియా విశ్వవిద్యాలయం), హిస్టరీ అండ్ టూరిజం విభాగానికి ప్రొఫెసర్ కె.విజయబాబు (కాకతీయ విశ్వవిద్యాలయం), పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కు ప్రొఫెసర్ డాక్టర్ ఏవిఎన్ రెడ్డి (డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం) నియమితులయ్యారు. సిలబస్ తయారీ, పాఠ్యాంశాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ విధానం, వివిధ విద్యాంశాల ప్రణాళిక రూపకల్పనలో వీరు ప్రధాన పాత్ర పోషించనున్నారు. రెండు సంవత్సరాల పాటు వీరు సేవలందించనున్నారు.
మూడో విడుత న్యాక్ గ్రేడింగ్ లో ఎంజీయూ ఏ గ్రేడ్ సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధ్యాపకులకు వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ సూచించారు. న్యాక్‌కు అందించే సెల్ఫ్ స్టడీ రిపోర్ట్స్ లోని అంశాలపై అధ్యాపకులు క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండి తద్వారా తమ విభాగాల ప్రత్యేకతల అనుసారం ముందుకు సాగాలన్నారు. పీహెచ్డీ పరిశోధక విద్యార్థులు తమ పరిశోధన కాలంలో కనీసం రెండు పరిశోధన పత్రాలను సమర్పించాలని, ఆ దిశగా అధ్యాపకులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరం నుండి ఉత్తమ విద్యార్థులు, ఉత్తమ అధ్యాపకులను శాఖల వారీగా ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, సిఓఈ డాక్టర్ ఉపేందర్ రెడ్డి, వివిధ విభాగాల డీన్స్ ప్రొఫెసర్ ఆకుల రవి, ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, ప్రొఫెసర్ రేఖ, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాల్ డా.కె. ప్రేమ్‌సాగర్, డా. కె. అరుణప్రియ, సిహెచ్ సుధారాణి, డా.శ్రీదేవి, స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ డా.హరీశ్ కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ డా. వై. ప్రశాంతి, ఐక్యూఏసీ డైరెక్టర్ డా.మిర్యాల రమేశ్ పాల్గొన్నారు.
2025-26 విద్యా సంవత్సరానికి గాను మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల విద్యార్థిని విద్యార్థులకు 20 అంశాల్లో ఆటల పోటీలను నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ హరీశ్‌కుమార్ తెలిపారు. కళాశాలల ప్రిన్సిపాల్ లు విశ్వవిద్యాలయాల సూచన మేరకు తమ విద్యార్థుల జాబితాను సిద్ధపరచి, స్పోర్ట్స్ బోర్డ్ కు ఈ నెల 15లోగా అందజేయాలని కోరారు. విద్యార్థుల జాబితాను అధికారికంగా usbmguict2025@gmail.çom మెయిల్ ద్వారా పంపవచ్చని తెలిపారు.
Nalgonda : ఎంజీయూ వివిధ విభాగాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల నియామకం