సూర్యాపేట, ఏప్రిల్ 26: జిల్లాలో 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు మే 1వ తేదీ నుంచి జూన్ 6 వరకు వేసవి క్రీడా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రాంచందర్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, వాలీబాల్ క్రీడల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లావ్యాప్తంగా 12 చోట్ల శిక్షణ తరగతులు జరుపనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 30వ తేదీ లోపు పేర్లను నమోదు చేసుకోవాలని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అందుకు గానూ గ్రామీణ ప్రాంతాల్లో 10 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని, నిర్ధేశించిన రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 9000481112 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.