
తిరుమలగిరి, డిసెంబర్ 6 :వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ఇతర పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నది. డిమాండ్ ఉన్న పంటలు వేసి లాభాలు పొందాలని చెబుతున్నది. దీంతో రైతులు పంటల మార్పిడికి ఆసక్తి చూప్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో వెయ్యి ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే ఉద్యాన శాఖకు 68 మంది రైతులు 417 ఎకరాల్లో సాగు చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు.
నీరు తేలిగ్గా ఇంకిపోయే భూములు అనుకూలం
మెట్ట ప్రాంతాల్లోని అన్ని రకాల నేలల్లో ఈ తోటలు పెంచవచ్చు. అధిక సేంద్రియ పదార్థం కలిగిన నీరు నిలువని లోతైన ఒండ్రు నేలలు, నీరు తేలికగా ఇంకిపోయే నేలలు ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలం. క్షార గుణం, ఉప్పు, చవుడు నేలలు పనికిరావు.
కోతులు, అడవి జంతువుల బెడద ఉండదు
ఆయిల్ పామ్ తోటలను పశువులు, జంతువులు, కోతులు తినవు. దీంతో రైతులకు ఆ బెడద ఉండదు. రోగాలు కూడా రావు.
సాగుకు రాయితీలు
డ్రిప్ కోసం ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీ, సన్న , చిన్న కారు రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తున్నది. రైతు వాటాగా మొక్కకు రూ.33 చెల్లించాలి. మొదటి 4 సంవత్సరాలకు ఎరువులకు 50 శాతం రాయితీ ఉంటుంది.
ఎకరానికి 15 టన్నుల వరకు దిగుబడి
ఆయిల్ పామ్ సాగుకు పెట్టుబడి తక్కువ. ఆరంభంలో ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.12 వేలు ఖర్చవుతుంది. పంట దిగుబడి ఎకరానికి 10 నుంచి 15 టన్నులు వస్తుంది. ప్రస్తుతం టన్నుకు మద్దతు ధర రూ. 18 వేలు ఉన్నది. దిగుబడి బాగా ఉంటే ఎకరానికి పెట్టుబడులు పోను ఏడాదికి రూ.1.5 లక్షలు ఆదాయం వస్తుంది. రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కలు నాటడం మొదలు పంట కొనుగోలు వరకు ప్రభుత్వమే చూసుకుంటుంది.
417 ఎకరాల్లో సాగుకు దరఖాస్తులు
తుంగతుర్తి నియోజకవర్గం ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలమని అధికారులు గుర్తించారు. దాంతో 6 మండలాల నుంచి 68 మంది రైతులు 417 ఎకరాల్లో సాగు చేసేందుకు ఉద్యాన శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. తిరుమలగిరి మండలంలో 40 ఎకరాలు(నలుగురు రైతులు), నాగారం 69 ఎకరాలు(12 మంది), జాజిరెడ్డిగూడెం 54 ఎకరాలు(9 మంది), తుంగతుర్తి 82 ఎకరాలు(10 మంది), నూతనకల్ 66 ఎకరాలు(13 మంది), మద్దిరాల 106 ఎకరాల్లో(20 మంది) సాగుకు సిద్ధమవుతున్నారు. మరో 600 ఎకరాల్లో సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
దామరచర్లలో 3వేల ఎకరాల్లో సాగు
మండలంలోని రైతులు ఇతర పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలకు ప్రభుత్వ ప్రోత్సాహం, సబ్సిడీ అందిస్తుండడంతో రైతులు ఆ వైపు అడుగులు వేస్తున్నారు.
ఆదర్శంగా బొత్తలపాలెం రైతులు
ఆరు నెలల క్రితం మండలంలోని బొత్తలపాలెం గ్రామానికి చెందిన ఇంజం అశోక్‌రెడ్డి, సైదిరెడ్డి ఆయిల్‌పామ్ మొక్కలను ఎనిమిది ఎకరాల్లో నాటారు. ప్రభుత్వం వీరికి 80 శాతం సబ్సిడీపై డ్రిప్‌తోపాటు ఒక్కో మొక్కకు రైతులు తమ వాటా కింద రూ.33 చెల్లించగా రూ.87 ప్రభుత్వం చెల్లించింది. సబ్సిడీపై మొక్కలను ఆంధ్రాలోని నెల్లూరు నుంచి తెచ్చి ఇచ్చారు. మొదటి నాలుగేండ్ల వరకు హెక్టారుకు రూ.5వేల విలువ గల మందులు, ఎరువులు ఉచితంగా అందజేస్తారు. ప్రస్తుతం మొక్కలు ఆశాజనకంగా ఉన్నాయి. మిర్యాలగూడ డివిజన్లో ఇప్పటి వరకు 10 మండలాల్లో 1000 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలను సాగు చేస్తున్నారు. దామరచర్ల మండలంలో 300 ఎకరాల్లో సాగుచేసేందుకు రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. కంపెనీ వారు మొక్కలు సిద్ధం చేయకపోవడంతో తోటల సాగుకు ఆలస్యమవుతున్నది. మండలంలోని ఇర్కిగూడెం, బొత్తలపాలెంలో భూములు సాగుకు రెడీగా ఉన్నాయి.
అంతర పంటగా మిర్చి, మునగ
బొత్తలపాలెంలో ఆశోక్‌రెడ్డి, సైదిరెడ్డి వేసిన ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటగా పత్తి, మిర్చి, మునగ సాగు చేస్తున్నారు. ఆయిల్‌పామ్ చెట్లు కాపుకొచ్చే వరకూ వీటిని వేసుకోవచ్చు. మిర్యాలగూడ డివిజన్లో ఇప్పటికే 700 ఎకరాల ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులు పంటను అమ్ముకుంటున్నారు. నేరుగా కంపెనీ వారే తమ వాహనాల్లో ఆయిల్ గెలలను తీసుకొని పోతున్నారు. నెలవారీగా కొంత ఆదాయం పొందుతున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే వేశాను..
గతంలో అనేక పంటలను సాగుచేసి తీవ్రంగా నష్టపోయాను. ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీతో నాకున్న నాలుగు ఎకరాల్లో ఆయిల్‌పామ్ వేసిన. నాలుగేండ్ల వరకు ప్రభుత్వం ఎరువులు ఉచితంగా ఇస్తున్నందున ఖర్చుకూడా అంతగా ఉండదు. మంచి లాభాలొస్తాయని ఆశిస్తున్నా.
ఇంజం సైదిరెడ్డి, బొత్తలపాలెం
స్టడీ టూర్లతో అవగాహన
రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు.సాగుకు ఆసక్తి ఉన్న రైతులను స్టడీ టూర్లకు తీసుకెళ్లి అవగాహన కల్పిస్తున్నాం. తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలకు చెందిన 50 మంది రైతులను అశ్వరావుపేట తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి తోటలను చూపించాం. అక్కడ చూసిన వాళ్లు సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు.
25 ఎకరాల్లో ఆయిల్ పామ్ వేసిన
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలని నిర్ణయించుకొని 25 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసిన. గత నెలలో ఉద్యాన అధికారుల సహకారంతో రుచిసోయా కంపెనీ మొక్కలను ఏలూరు నుంచి తెచ్చి పెట్టిన. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. నన్ను చూసి చాలా మంది రైతులు సాగుచేసేందుకు ముందుకు వస్తున్నారు.
-ఏడుదొడ్ల మధుసూదన్‌రెడ్డి, రైతు, మాలిపురం, తిరుమలగిరి