నాణ్యమైన చదువుకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కాలానుగుణంగా విద్యా వ్యవస్ధలో మార్పులు చేస్తూ విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించేలా సంసిద్ధులను చేస్తున్నది. మన ఊరు-మనబడిలో పాఠశాల ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన సర్కారు ఇంటర్మీడియట్‌లోనూ నూతన విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బీపీసీ విద్యార్థులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లోనూ నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేస్తున్నది. కాలేజీలూ ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. సహజంగానే ఇంగ్లిష్ అంటే విద్యార్థుల్లో ఉన్న ఆందోళనను పోగొట్టి, సబ్జెక్ట్‌పై మరింత దృష్టి పెట్టేలా చేసేందుకు ఇది దోహద పడుతుందని విద్యావేత్తలు చెప్తున్నారు.
రామగిరి, జూలై 22 : పదో తరగతి, తర్వాత ఇంటర్మీడియెట్ విద్య విద్యార్థి జీవిత లక్ష్యం చేరేందుకు వేదికగా భావిస్తారు. కావునా ఇంటర్లో అన్ని అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సమగ్ర వికాసం చెందేలా చూస్తారు. ఆ దిశలో ఇంటర్మీడియెట్‌లో సైన్స్ విద్యార్థులకు అమలు చేస్తున్న ప్రాక్టికల్ విధానం ఇక ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో సహితం అమలు చేసేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు శ్రీకారం చుట్టింది. ఇంగ్లిష్ కమ్యూనికేషన్‌పై పట్టు సాధిస్తే ఉద్యోగ సాధనలో సహితం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భా వించడంతో అమలును ఇంటర్మీడియెట్ బోర్డు ఆచరణలోకి తీసుకువచ్చింది. అందులో భాగంగానే ఈ విద్యాసంవత్సరం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆ దిశగా విధి విధానాలను సిద్ధం చేసి త్వరలోనే విడుదల చేయనున్నది.
ప్రాక్టికల్స్ ఇలా..
ఇంటర్లో ఇప్పటి వరకు ఎంపీసీ, బీపీసీ విద్యార్థులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. ఇక ఇప్పుడు ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. మొత్తం 100 మార్కులకు ప్రాక్టికల్స్ 20, థియరీకి 80 మార్కులు కేటాయించారు.
ఉమ్మడి జిల్లాలో 240 జూనియర్ కళాశాలలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి 240 జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో 13, సూర్యాపేటలో 10, యాదాద్రి భువనగిరిలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలుండగా మిగిలినవి ప్రైవేట్ జూనియర్ కళాశాలలు. ఈ విద్యార్థులందరికీ సైన్స్ కోర్సులు ఎంపీసీ, బీపీసీ మాదిరిగానే ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో సహితం 20 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2023-24)లో అమలు కానున్నది.
నాలుగు దశల్లో ప్రాక్టికల్స్
ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా..
చాలా మంది విద్యార్థులు ఇంగ్లిష్ అంటేనే భయపడుతుంటారు. దాన్ని గమనించిన ప్రభుత్వం విద్యార్థులకు ఇంగ్లిష్ భాషపై మక్కువ పెంచేలా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్‌లో ఇంగ్లిష్ సబ్జెక్ట్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నది. ప్రాక్టికల్ విధానంతో విద్యార్థులకు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ పెరిగి భవిష్యత్తులో ఉద్యోగ సాధనతో పాటు ఏ ప్రాంతానికి వెళ్లినా సులభంగా అక్కడి పరిస్థితులు తెలుసుకుని రావడానికి అవకాశం.
ఇంగ్లిష్‌పై పట్టు సాధించేందుకు చక్కటి మార్గం
చాలా మంది విద్యార్థులకు ఇంగ్లిష్ అంటేనే భయం ఉంటుంది. అయితే ప్రతి విద్యార్థి ఇంగ్లిష్‌లో పట్టు సాధించాలనే ఉద్దేశ్యంతో చదువడం, రాయడం, మాట్లాడడం అనే అంశాలపై ప్రత్యేక శ్రద్ధతో చదివిస్తాం. అయినప్పటికీ విద్యార్థులు సబ్జెక్ట్‌ను కొంత నిర్లక్ష్యం చేస్తూనే ఉంటారు. అలాంటి అవకాశం లేకుండా ప్రభుత్వం, ఇంటర్మీడియెట్ విద్యాశాఖ ఇంగ్లిష్ సబ్జెక్ట్‌కు సహితం సైన్స్ కోర్సుల మాదిరిగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాక్టికల్స్ అమలు చేయడం హర్షనీయం. ప్రతి విద్యార్థి ఇంగ్లిష్‌లో పట్టు సాధించడానికి ఇది చక్కటి మార్గం.
– మాలే వెంకట్‌రెడ్డి, ఇంగ్లిష్ అధ్యాపకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రామన్నపేట
ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం
ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా ఇంటర్మీడియెట్‌లో ప్రాక్టికల్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం చేయడం హర్షనీయం. మార్గదర్శకాలు రావాల్సి ఉన్నది. విద్యార్థులకు ఇంగ్లిష్ అంటే భయం పోయి ఆసక్తిగా చదువాలనే ఆలోచన పెరుగుతుంది. దాంతో విద్యార్థులు భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలకు వెళ్లిన సందర్భంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
– దస్రూనాయక్, డీఐఈఓ, నల్లగొండ