యాదాద్రి, ఆగస్టు 24 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నిత్య పూజలు బుధవారం కోలాహలంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన అర్చక బృందం తిరువారాధన, నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చనలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై మండపంలో ఊరేగించారు.
లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణ తంతు జరిపించారు. సాయంత్రం వేళలో స్వామివారి వెండి మొక్కు జోడు సేవ, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి 7గంటలకు స్వామివారి తిరువారాధన చేపట్టి, స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన చేశారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో ఆలయ క్యూలైన్లు, మాఢవీధులు సందడిగా మారాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. యాదగిరిగుట్ట క్షేత్రంలో చేపడుతున్న ‘శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన’ కార్యక్రమం బుధవారానికి 27వ రోజుకు చేరింది. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి ఖజానాకు రూ. 22,58,871 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామి సన్నిధిలో ప్రముఖులు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని విశ్రాంత న్యాయమూర్తి రాజశేఖర్‌రెడ్డి, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కుటుంబసభ్యులతో వేర్వేరుగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేయగా, ఆలయాధికారులు స్వామివారి ప్రసాదం అందించారు.
స్వామివారికి వెండి కలశాలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి హైదరాబాద్‌లోని బోయినపల్లికి చెందిన బంగారు కృష్ణమూర్తి, మంజుల దంపతులు రెండు వెండి కలశాలను బహూకరించారు. ఈ మేరకు బుధవారం కలశాలను యాదాద్రి ఆలయంలో ఆలయాధికారులకు అందించారు.
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల పూజలు
సీఎం కేసీఆరే నికార్సైన హిందువుని, దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా రాష్ట్రంలోని ఆలయాలకు పూర్వవైభవం తెచ్చారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన కుటుంబసమేతంగా యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మాట్లాడుతూ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంతో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. పూర్తి కృష్ణశిలలతో యాదాద్రి ఆలయం మహద్భుతంగా రూపుద్దుకుందని చెప్పారు.