మిర్యాలగూడ, అక్టోబర్ 30 : దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పరిధిలోని యాదాద్రి పవర్ ప్లాంట్ స్టోర్ యార్డ్ వద్ద డంప్ చేసిన అల్యూమినియం రోల్స్‌ను దొంగిలిస్తున్న ముఠాలోని ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మిర్యాలగూడ పట్టణం ఎన్ఎస్పీ క్యాంపునకు చెందిన షేక్ మునీర్, దామరచర్ల మండలం ఇర్కిగూడేనికి చెందిన కంబాల అశోక్, గోపిశెట్టి అజయ్, పసుపులేటి కోటేశ్వర్రావు, సెక్యురిటీ గార్డ్ పుల్లయ్యను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
గతంలో వైటీపీఎస్‌లో సామగ్రిని దొంగతనం చేసిన కేసులో నిందితులుగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రంజిత్కుమార్వర్మ, అభయ్, ప్రతాప్, మౌర్యను ఇటీవల అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా మరి కొందరు అల్యూమినియం రోల్స్ దొంగతనం చేస్తున్నట్లు తేలిందన్నారు. వీరంతా బీహెచ్ఈఎల్ కంపెనీకి చెందిన స్టోర్యార్డు వద్ద సెక్యురిటీలుగా పనిచేసే సిబ్బందితో పరిచయం చేసుకొని సూపర్వైజర్ల సాయంతో తమ వాహనాల్లో అల్యూమినియం రోల్స్ లోడ్ చేసుకొని హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన షర్ఫొద్దిన్, ఖైరుద్దిన్, షేక్ ముజీబ్, వహీద్అలీకి విక్రయించి సొమ్ము చేసుకున్నారని తేలిందని చెప్పారు.
ఒక్కో అల్యూమినియం రోల్ రూ.6.50 లక్షల విలువ ఉండగా వీరు రూ. లక్షకే విక్రయించినట్లు తెలిపారు. మరో పది మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారిని అరెస్ట్ చేసి మరికొంత విలువగల ప్రాపర్టీని రికవరీ చేస్తామని అన్నారు. నిందితుల నుంచి రూ.15.35లక్షల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రూరల్ సీఐ వీరబాబు, సీసీఎస్ సీఐ జితేందర్‌రెడ్డి, సీసీఎస్ ఏఎస్ఐ అఫ్జల్అలీ, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్‌గిరి, పుష్పగిరి, ఇమ్రాన్, వహీద్, లింగారెడ్డిని డీఎస్పీ అభినందించారు.