నల్లగొండ విద్యా విభాగం, మార్చి 29 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చేయూతనివ్వనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాట్రోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. శనివారం మహాత్మాగాంధీ యూనివర్సిటీని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వీసీ చాంబర్లో యూనివర్సిటీ అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై.ప్రశాంతి, ఐక్య సి కోఆర్డినేటర్ డాక్టర్ మిర్యాల రమేశ్‌కుమార్, సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, హాస్టల్స్ డైరెక్టర్ డా.దోమల రమేశ్, స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ హరీశ్ కుమార్‌తో పాటు వివిధ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి యూనివర్సిటీలో నూతనంగా ప్రవేశపెట్టే కోర్సులు, వాటి వివరాలు, వాటికి కావాల్సిన నిధులు, సిబ్బంది ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమగ్ర డీపీఆర్ సిద్ధం చేసి ఇస్తే ప్రభుత్వంతో చర్చించి అనుమతులు ఇప్పించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేద్దామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ తో పాటు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించి శంకుస్థాపన చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.అన్ని అంశాలపై సంపూర్ణమైన నివేదికలను ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, యూనివర్సిటీ వివిధ విభాగాల అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
MGU : ఎంజీయూ అభివృద్దికి అన్ని విధాలా చేయూత : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి