రామగిరి, నవంబర్ 27 : కేంద్రంలోని మోదీ సర్కార్ పాలనా తీరుతో దేశంలోని రైతాంగం సంక్షోభంలోకి నెట్టబడింది. ప్రధాని రైతుద్రోహిగా న్యాయం జరుగాలంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎస్) జాతీయ కార్యదర్శి హన్నన్ మొల్ల అన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభల సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐకేఎస్ 1936లో ఏర్పడిందన్నారు.
నాటి నుంచి శ్రమ దోపిడీ నుంచి పీడిత ప్రజల విముక్తి కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందన్నారు. ఈ పోరాటంలో నాలుగు వేల మంది బలికాగా, వారిలో వెయ్యిమంది నల్లగొండ జిల్లావారే ఉన్నట్లు గుర్తుచేశారు. భూస్వాముల దోపిడీకి, బ్రిటీష్ పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించిందన్నారు. ‘దున్నే వాడికే భూమి’ అనే నినాదంతో రైతులను సమీకరించి ఉద్యమాలు చేశామన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర చరిత్రలో పాలకుల విధానాలతో రైతులు పేదరికంలో మగ్గుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వాల వైఫల్యాలతో రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటను కారుచౌకగా కొనుగోలు చేస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మోదీ అధికారంలోకి రాకముందు దేశంలో బీజేపీ నిర్వహించిన 400 సభల్లో ఆ పార్టీ అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ, అధికారంలోకి వచ్చి 8 ఏండ్లయినా రైతుల సమస్యలను పరిష్కరించలేదన్నారు.
పేదల భూములు లాక్కొని అదానీ, అంబానీకి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కొవిడ్ కాలంలో గుట్టుచప్పుడు కాకుండా మోదీ తీసుకొచ్చిన నల్లచట్టాలను దేశంలోని 500 రైతు సంఘాలు కలిసి ఏడాదిపాటు ఐక్యంగా పోరాడడంతో వెనక్కి తీసుకున్నట్ల తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాల రాజధానుల్లో ఉద్యమాలు నిర్వహించి ఆయా రాష్ర్టాల గవర్నర్లకు వినతిపత్రాలు అందజేసి సమస్యలను కేంద్రానికి నివేదించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
వేలాది మందితో నల్లగొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. సభా వేదికపై కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మోదీ ప్రజా, రైతు వ్యతిరేక పాలనను వివరించేలా ప్రదర్శనలు ఇవ్వడంతో అందరినీ ఆలోచింపజేశాయి.
నేడు, రేపు మహాసభలు..
మహాసభల్లో భాగంగా నేడు, రేపు నల్లగొండలోని ఏచూరి గార్డెన్స్‌లో ఏఐకేఎస్ జాతీయ ప్రధాన అధ్యక్ష, కార్యదర్శులతోపాటు 800మంది ప్రతినిధులతో మహాసభలు కొనసాగనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలు తీర్మానాలు చేసి కేంద్రంలోని మోదీ సర్కార్ తీరును ఎండగట్టనున్నారు.
వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్ర : పోతినేని
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులక అవసరమైన ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడం లేదని, మార్కెట్లు అందుబాటులో లేవని పేర్కొన్నారు. కేంద్ర దోపిడీని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయని తెలిపారు.
అదానీ, అంబానీల నివేదికలను అనుసరిస్తున్న మోదీ : జూలకంటి
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలకు కారణం కేంద్ర ప్రభుత్వమే అని పేర్కొన్నారు. దేశంలో సంవత్సరానికి 10వేల మంది, రాష్ట్రంలో 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. ఇందుకు మోదీ సర్కార్ అదానీ, అంబానీ నివేదికలను అనుసరించడం, స్వామినాథన్ నివేదికలను పట్టించుకోకపోవడమే కారణమన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ.. మోదీ సర్కారు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగాట్టారు.
సమావేశంలో ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి డాక్టర్ విజ్జుకృష్ణన్, ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంతల చంద్రారెడ్డి, రాష్ట్ర నాయకుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి కూన్‌రెడ్డి నాగిరెడ్డి, తుమ్మల వీరారెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు మల్లు లక్ష్మి, నాగార్జున్‌రెడ్డి, పి.జంగారెడ్డి, అరిబండి ప్రసాద్‌రావు, బండ శ్రీశైలం, కందాల ప్రమీల, పాలడుగు ప్రభావతి, పాలడుగు నాగార్జున, సయ్యద్ హాషం, మంగ నర్సింహ, కట్టా నర్సింహ, దండ వెంకట్‌రెడ్డి, మేక అశోక్‌రెడ్డి, మాటూరి బాలరాజుగౌడ్, నారి ఐలయ్య పాల్గొన్నారు.