బీబీనగర్ ఎయిమ్స్ డ్రోన్ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది. తెలంగాణలోనే తొలిసారిగా తీసుకొచ్చిన డ్రోన్ సేవలు విజయవంతం అయ్యాయి. ట్రయల్ రన్ ఫలప్రదం కావడంతో సర్వీసులను విస్తరించారు. జిల్లాలో తొలుత పలు పీహెచ్సీలలో అమలు చేయగా.. ఇప్పుడు అన్ని చోట్లా సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి 1200 నమూనాలను ఆస్పత్రులకు చేరవేశారు. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో మందులు కూడా సరఫరా చేశారు.
– యాదాద్రి భువనగిరి, జనవరి 20 (నమస్తే తెలంగాణ)
సాంకేతికంగా ప్రపంచం దూసుకుపోతున్నది. టెక్నాలజీ పరంగా అద్భుతాలు ఆవిషృతమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్ రంగాల్లో మనిషి రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాడు. అయితే ఈ టెక్నాలజీని ఆరోగ్య రంగంలో మిక్స్ చేసి.. అద్భుతాలు సృష్టించేందుకు ఎయిమ్స్ శ్రీకారం చుట్టింది. డ్రోన్ల ద్వారా ఆరోగ్య, సేవల రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జిల్లాలో జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం కింద కఫం నమూనాలు, ఇతర మందుల రవాణాలో వినియోగంలో సాధ్యాసాధ్యాల అధ్యయనంపై ఎయిమ్స్‌కు డ్రోన్ ప్రాజెక్ట్‌ను మంజూరు చేసింది. 2023 డిసెంబర్ 14 నుంచి డ్రోన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం కలెక్టర్, డీఎంహెచ్ఓ, డీజీపీ, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకున్నారు. మొదటగా వివిధ ప్రాంతాలకు ట్రయల్ రన్ నిర్వహించారు.
గిరిజన, కొండ ప్రాంతాల్లో మెరుగైన, సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా డ్రోన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలకు సిబ్బంది వెళ్లి రక్త నమూనాలు తీసుకువచ్చేందుకు ఎకువ సమయం పడుతుంది. ఇకపై ఆ అవసరం లేకుండా డ్రోన్‌లో ఇంజక్షన్లను వైద్యులకు పంపిస్తున్నారు. నిమిషాల వ్యవధిలోనే షాంపిల్స్‌ను చేరవేస్తున్నారు. అతి తకువ సమయంలో రోగ నిర్ధారణ చేసి, అవసరమైతే తిరిగి మందులను కూడా డ్రోన్‌లో పంపిస్తున్నారు. దీనివల్ల సమయం, మానవ వనరులతో డబ్బులు ఆదా అవుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 1200 నమూనాలను చేరవేశారు.
ట్రయల్ రన్ పూర్తి కావడంతో గతేడాది జనవరి నుంచి రెగ్యులర్‌గా సేవలు కొగసాగిస్తూ వస్తున్నారు. అయితే తొలుత పరిమిత సంఖ్యలో పీహెచ్సీ, సబ్ సెంటర్లకు అనుసంధానించారు. బొల్లెపల్లి, కొండమడుగు బొమ్మలరామారం పీహెచ్‌సీలు, మర్యాల, నందనం సబ్ సెంటర్లకు భువనగిరి ట్యూబర్కోలసిస్ యూనిట్‌కు, వరట్పల్లి, మునిపంపుల పీహెచ్‌సీలను రామన్నపేట యూనిట్‌కు అటాచ్ చేశారు. ఆయా చోట్ల సేవలు విజయవంతం కావడంతో గతేడాది అక్టోబర్ 30న ప్రధాని మోదీ వర్చువల్‌గా డ్రోన్ సేవలను ప్రారంభించారు. అనంతరం జిల్లా అంతటా సేవలను విస్తరించారు. నిత్యం ఎకడో ఓ ప్రాంతానికి డ్రోన్‌ను పంపించి సేవలు అందిస్తున్నారు.
ప్రస్తుతం ముగ్గురు పైలట్లు, రెండు డ్రోన్లను నడుపుతున్నారు. ఒకటి 8 కిలోల సామర్థ్యంతో, మరొకటి 15 కిలోలతో సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఒకో డ్రోన్ దాదాపు 60-70 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. ఆ తర్వాత బ్యాటరీలను రీచార్జి చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా జిల్లా నుంచి పలువురు ఆశ వరర్లకు డ్రోన్లపై శిక్షణ ఇచ్చారు. వీరు డ్రోన్లను ఆపరేట్ చేయడంలో సహకరిస్తున్నారు. డ్రోన్లతో నిమిషాల వ్యవధిలోనే నమూనాలను చేరవేస్తున్నారు. ఇటీవల అడ్డగూడూరు మండలంలోని గట్టుసింగారంలో టీబీ రోగుల నుంచి శాంపిళ్లను సేకరించి రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు డ్రోన్ సహాయంతో పంపించారు. అడ్డగూడూరు నుంచి రామన్నపేటకు 53 కిలోమీటర్ల దూరం ఉండగా, వాహనంతో పంపిస్తే ఒక గంట 20 నిమిషాలు పడుతుంది. అదే డ్రోన్‌తో 30 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంది.