గరిడేపల్లి, జూన్ 9 : దేశీ కోర్సు చేస్తున్న ఉపకరణాల డీలర్లు శిక్షణలో తాము నేర్చుకున్న విషయాలను రైతులకు తెలియజేయాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌రెడ్డి అన్నారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో గల కృషి విజ్ఙాన కేంద్రంలో ఆదివారం జరిగిన 2022 – 23 దేశీ కోర్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీలర్ల వద్దకు వచ్చే రైతులను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటికి తగిన మందులనే ఇవ్వాలన్నారు.
అప్పుడే రైతులు సాగు చేసిన పంటల ద్వారా మంచి దిగుబడులు సాధించగలుగుతారని తెలిపారు. గడువు దాటిన మందులను ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇవ్వకూడదన్నారు. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల వాడకం వల్ల కలిగే లాభాల గురించి రైతులకు వివరించాని చెప్పారు. అనంతరం కేవీకే ఇన్చార్జి పీసీ దొంగరి నరేశ్ మాట్లాడుతూ 48 వారాల పాటు కేవీకేలో నేర్చుకున్న అనుభవాలను రైతులకు వివరించి, సాగు చేసిన పంటల నుంచి మంచి దిగుబడులు సాధించేలా చూడాలన్నారు. ఆ తర్వాత కోర్సు పూర్తి చేసుకున్న డీలర్లకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేశీ కోర్సు ఫెసిలిటేటర్ పి.శంకర్రావు, 40 మంది డీలర్లు పాల్గొన్నారు.