కట్టంగూర్, ఏప్రిల్ 18 : ఈ నెల 22న శాలిగౌరారం మండలం ఇటుకుల పహాడ్ గ్రామంలో జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా 11వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కోశాధికారి గజ్జి రవి పిలుపునిచ్చారు. శనివారం కట్టంగూర్ మండలం ఈదులూరులోని బూరుగు అంజయ్య స్మారక భవనంలో సంఘం నాయకులతో కలిసి మహాసభ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ, మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందన్నారు. దేశంలో రైతు కూలీల సమస్యల పరిష్కారానికి అఖిల భారత రైతు కూలీ సంఘం నిరంతరం పోరాటాలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బూరుగు సత్యనారాయణ, గంగనబోయిన వీరాంజనేయులు, దండెంపల్లి, చంద్రయ్య, నిమ్మనగోటి రాములు, అంజయ్య, ఉయ్యాల పాపయ్య, గద్దపాటి అంజయ్య పాల్గొన్నారు.