యాదాద్రి భువనగిరి, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : రామన్నపేటలో ఏర్పాటు చేయాలనుకున్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ తన నిర్ణయాన్ని ఎట్టకేలకు ఉపసంహరించుకుంది. దాని స్థానంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు శనివారం రాత్రి యాదాద్రి కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం తమ నిర్ణయాన్ని వెల్లడించారు. వాస్తవానికి రామన్నపేటలో డ్రైపోర్టు పేరుతో ఆ సంస్థ రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి.. ఆ తర్వాత అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని భావించింది.
ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ ఏర్పాటును రామన్నపేటతోపాటు చుట్టు పక్క గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫ్యాక్టరీ ఏర్పాటైతే రామన్నపేట కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా అఖిల పక్షంగా ఏర్పడి ముక్తకంఠంతో నినదించారు. కాగా ఈ సమస్యను నమస్తే తెలంగాణ అక్షరబద్ధం చేసింది. నిత్యం కథనాలు వెలువరిస్తూ అక్షర కవాతు చేసింది. అప్పటి వరకు రామన్నపేటకే పరిమితమైన ఆందోళనను రాష్ట్ర వ్యాప్తం చేసింది. జనం గోడును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునేలా చేసింది.
అదానీ కంపెనీ రైతులను ఎలా మో సం చేసింది..? ఫ్యాక్టరీ వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి..? కాలు ష్యం ఎలా కోరలు చాస్తుంది..? రామన్నపేట ఎట్ల ఆగం అవుతుంది..? మూసీ మరింత మురికి కూపంగా ఎలా మారుతుంది..? పేద ల ఉపాధికి ఎట్ల గండి పడుతుంది..? ఇలా అనేక కోణాల్లో నమస్తే తెలంగాణ దినపత్రిక పూసగుచ్చినట్లు నిత్యం కథనాలను ప్రచురించింది. ప్రజలను చైతన్యం చేయడంతోపాటు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ప్రతి రోజు స్థానికుల ఆందోళన లు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన వార్తలను తొలి ప్రాధాన్యం గా తీసుకొని బాధితులకు వెన్నుదన్నుగా నిలిచింది.
ఈ విషయమై బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు అనేక మంది ప్రముఖులు స్పం దించేలా చేసింది. కొంత కాలం గా అదానీ సంస్థ తమ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా అదానీ యాజమాన్యం సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని వెన క్కు తీసుకుంది. దీంతో రామన్నపేటతోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆపత్కాలంలో తమకు అండగా నిలిచిన నమస్తే తెలంగాణ దినపత్రికకు రామన్నపేట వాసులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
